
టీడీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
చిత్తూరు: చంద్రబాబు ప్రభుత్వం ఎస్టీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం చేస్తోందని చిత్తూరు టీడీపీ ఎంపీ శివప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం అంబేద్కర్ జయంతి సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుడ్డారు.
‘ఏపీలో ఎస్సీ, ఎస్టీలు 25 శాతం మంది ఉన్నారు. ఈ లెక్కన ఐదు మంత్రి పదవులు రావాలి కానీ రెండు పదవులిచ్చి చేతులు దులుపుకున్నారు. కేంద్రంలో రాష్ట్రానికి రెండు మంత్రి పదవులు వస్తే రెండూ ఓసీలకే ఇచ్చారు. డిప్యూటీ సీఎం పదవులను బీసీలకు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీలను అన్నిరకాలుగా మోసం చేస్తున్నారు. మేనిఫెస్టోలో చెప్పిన 90 శాతం హామీలు అమలు చేశామని చెబుతున్నారు. మిగిలిన ఆ పదిశాతం హామీలు మాల, మాదిగలవా?
పరిశ్రమల పేరుతో డీకేటీ భూములను లాక్కుంటే పట్టించుకోరా? దళితులకు పరిహారం ఇవ్వరా? ల్యాండ్ పూలింగ్ కింద భూములు తీసుకుని ఓనర్లను శ్రామికులుగా మారుస్తున్నారు. ప్రభుత్వ భూములు కబ్జా అయినా పట్టించుకోరు. దళితులు అందులో ఉంటే ఖాళీ చేయాలని నోటీసులు ఇస్తారు. దళితులకో న్యాయం, పైవర్గాల వారికి మరో న్యాయమా? పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్ షిప్ లు కట్ చేశారు. దళితులు ఉన్నత చదవులు చదువుకోవద్దా? బ్యాక్ లాగ్ ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లిస్తున్నారు. ప్రతి విషయంలోనూ చంద్రబాబు అన్యాయం చేస్తున్నార’ని శివప్రసాద్ ధ్వజమెత్తారు.