
చెన్నై : వేల కోట్ల రుణాలు కొల్లగొట్టి బ్యాంకులకు టోకరా వేసిన కేసులో టీడీపీ రాజ్యసభ ఎంపీ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడు సుజనా చౌదరి సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. బ్యాంకుల నుంచి రుణాల ద్వారా సేకరించిన మొత్తాలను దారిమళ్లించిన వైనంపై ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నించినట్టు సమాచారం. డొల్ల కంపెనీలపైనా ఈడీ అధికారులు పలు కోణాల్లో సుజనాను ప్రశ్నించినట్టు తెలిసింది.
ఈడీ విచారణ ముగిసిన అనంతరం సుజనా చౌదరిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా సమాధానం ఇవ్వలేక వారిపై చిందులు తొక్కారు. ఎప్పటిలాగానే తన సహజసిద్ధ దబాయింపు ధోరణితో తాను నిజాయితీపరుడినని చెప్పుకునేందుకు ప్రయత్నించారు. బ్యాంకుల ఫిర్యాదు మేరకు సుజనా చౌదరి కంపెనీలపై ఈడీ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. సుజనా చౌదరి మొత్తం 126 డొల్ల కంపెనీలు సృష్టించి.. బ్యాంకుల నుంచి ఏకంగా రూ. 7500 కోట్లు కొల్లగొట్టారని ఈడీ వెల్లడించింది.
ఇప్పటికే సుజనా చౌదరి అక్రమాలపై ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాయి. కాగా, ఈడీ జారీ చేసిన సమన్లు రద్దు చేయాలని సుజనా చౌదరి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గత శుక్రవారం దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ ధర్మాసనం పిటీషనర్ వాదనలతో ఏకీభవించలేదు. దీంతో పిటిషన్‌ను కొట్టివేస్తూ.. డిసెంబర్ 3న ఈడీ ముందు సుజనా చౌదరి వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందేనని కోర్టు ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment