పారదర్శకతకు పాతర.. పింఛన్ల జాతర
పలాస: కమిటీల నిండా అధికార పార్టీ నేతలు.. వారి ఇళ్లలోనే జాబితాల పరిశీలనలు.. సవాలక్ష కొర్రీలు.. ఇవన్నీ చూస్తున్న పింఛనుదారులకు బెంగ పట్టుకుంది. అర్హులకు పింఛన్లు అందుతాయో లేదో.. తుది జాబితాలో తమ పేర్లు ఉంటాయో లేదోనన్న ఆందోళన వృద్ధులు, వితంతువులు, వికలాంగుల్లో నెలకొంది. వీరందరికీ ప్రస్తుతం ఇస్తున్న పింఛన్ మొత్తాలను పెంచుతామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. దానికి ముందు ప్రస్తుత లబ్ధిదారుల్లో చాలామంది అనర్హులు ఉన్నారంటూ ప్రత్యేక కమిటీలు వేసి గ్రామస్థాయిలో సర్వే నిర్వహిస్తోంది. రాజకీయ ప్రాబల్యంతో ఏర్పాటైన ఈ కమిటీల సర్వేపై మొదటి నుంచీ అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ‘సాక్షి’ మంగళవారం జిల్లావ్యాప్తంగా సర్వే జరుగుతున్న తీరును పరిశీలించినప్పుడు లబ్ధిదారుల ఆందోళన నిజమేనని తేలింది.
ఎన్నికల్లో ఓడిన వారికి కమిటీల్లో చోటు
కీలకమైన సర్వే నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన కమిటీల్లో తెలుగుదేశం కార్యకర్తలను సభ్యులుగా నియమించారు. అందులోనూ పంచాయతీ, మండల, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి, ప్రజల తిరస్కరణకు గురైన వ్యక్తులను నియమించారు. వైఎస్‌ఆర్ కాంగ్రె స్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్న చోట అడ్డగోలుగా జరిపిన ఈ నియామకాల వల్ల తమకు ఓట్లు వేయని లబ్ధిదారుల పేర్లను ఏదో ఒక సాకుతో తొలగించేందుకు అవకాశమిచ్చినట్లేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండల కమిటీల్లో ఎంపీపీ, జడ్‌పీటీసీ, ఎంపీడీవో, ఇద్దరు ఎంపీటీసీలు, ఇద్దరు సర్పంచులు ఉండాలి. గ్రామ పంచాయితీ కమిటీలో సర్పంచి, ఎంపీటీసీ, సెక్రటరీతో పాటు ఒక ఎస్సీ లేక ఎస్టీ, ఇద్దరు సామాజిక కార్యకర్తలను నియమించాలి. మెజారిటీ కమిటీల్లో ఈ పద్ధతి పాటించనేలేదు.
ప్రహసనంగా పరిశీలన
కమిటీల పరిశీలన కూడా ప్రహసనంగా సాగింది. ఈ నెల 18 నుంచి 23(మంగళవారం) వరకు ప్రస్తుత పింఛనుదారుల అర్హతల పరిశీలనతోపాటు కొత్తగా దరఖాస్తు చేసుకునే వారి అర్హతలను పరిశీలించాల్సి ఉంది. అయితే ఇదంతా తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలా సాగిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో అన్ని రకాలు కలుపుకొని 2,61, 871 మంది పింఛనుదారులు ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరెడ్డి హయాం నుంచీ వీరిలో చాలామంది ఫించన్లు అందుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం కొత్తవారికి పింఛన్లు మంజూరు చేయాల్సింది పోయి బోల్డన్ని షరతులు పెట్టి పాతవారిని తొలగిం చేందుకు ప్రయత్నిస్తోందని లబ్ధిదారులు విమర్శస్తున్నారు. పరిశీలన పేరిట వృద్ధులు, వికలాంగులను టీడీపీ నాయకులు తమ ఇళ్ల చుట్టూ తిప్పుకుంటున్నారు. కొన్ని చోట్ల గ్రామ సభలు నిర్వహిస్తున్నా.. పరిశీలన పేరిట గంటల తరబడి వృద్ధులను ఎండలో నిలబెట్టేస్తున్నారు. మరికొన్ని చోట్ల స్థానిక ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్దే సభలు జరుగుతున్నాయి. పలాస- కాశీబుగ్గ మున్సిపాలిటీలోని ఏడో వార్డులో ఆ వార్డు కౌన్సిలర్ ఇంటి వద్దే మంగళవారం దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన కార్యక్రమం జరిగింది. కమిటీలో కీలకమైన మున్సిపల్ కమిషనర్ లేకుండానే ఈ కార్యక్రమం జరగడం విశేషం. ఎక్కడ కూడా లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పరిశీలన చేయడం లేదు. కొంతమందికి పరిశీలన జరుగుతున్న విషయమే తెలియడం లేదు. ఈ పరిస్థితుల్లో ఉన్న పింఛన్లు కొనసాగుతాయో లేదో.. కొత్తవి వస్తాయో రాదో తెలియక పేదలు ఆందోళన చెందుతున్నారు.
అర్హులందరికీ పింఛన్లు
అర్హులందరికీ పింఛన్లు అందుతాయి. వారిని గుర్తించేందుకే క్షేత్ర స్థాయిలో కమిటీలు వేశాం. గ్రామ సభలు నిర్వహిస్తున్నాం. అంతా పారదర్శకంగా జరుగుతుంది. నిబంధనల మేరకే ఎంపిక కమిటీలను వేశాం. ఇందులో ఎటువంటి లోపాలు లేవు.
-తనూజారాణి, ప్రాజెక్ట్ డెరైక్టర్, డీఆర్‌డీఏ
తప్పులు జరిగితే అధికారులదే బాధ్యత
ఫించన్ల సర్వేలో కమిటీల పాత్ర నామమాత్రమే. అవకతవకలు జరగడానికి ఆస్కారం లేదు. తప్పులు జరిగితే అధికారులే బాధ్యత వహిస్తారు. ఈ విషయాన్ని టెలీకాన్ఫరెన్సులోనే సీఎం స్పష్టం చేశారు. అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగితే వారికే నష్టం.
-జి.ఎస్.ఎస్. శివాజీ, పలాస ఎమ్మెల్యే