దుర్గా ఘాట్ ఎదురుగా ఏర్పాటు చేసిన బ్యానర్లు
సాక్షి, విజయవాడ: దుర్గగుడిలో ప్రచారానికి అధికార పార్టీ నేతలు తహతహలాడుతున్నారు. దుర్గమ్మ సన్నిధిలోనూ, దుర్గగుడి ఆస్తులపైన అమ్మవారి ప్రచారం తప్ప మరొకటి ఉండకూడదనే నిబంధన ఉంది. అయితే అధికారపార్టీ నేతలు దీన్ని పట్టించుకోవడం లేదు. తమ ఇష్టానుసారంగా వ్యవహరించడం పలు విమర్శలకు దారి తీస్తోంది.
ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ..
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తిరిగి అధికారంలోకి రావాలంటూ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఆనందసూర్య ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ఈ నెల 9వ తేదీన ఆదివారం చేయనున్నారు. దీనికి సంబంధించిన బ్యానర్లు అర్జున వీధిలో వెలిశాయి. వాస్తవంగా గతంలో ఉన్న అర్జున వీధిని విస్తరించినప్పుడు దుర్గగుడికి ప్రత్యేకంగా ఒక రోడ్డు వేసుకున్నారు. అక్కడ పర్గోలా కట్టారు. అలాగే పాత అర్జున వీధిలో అన్నదానం భవనం దుర్గగుడికి చెందింది. ఇంద్రకీలాద్రి కింద దుర్గాఘాట్ ఉన్న ప్రాంతం దుర్గగుడి పరిధిలోకే వస్తుంది. అయితే అక్కడ ఆనందసూర్య అనుచరులు ఆయన గిరి ప్రదక్షణ విజయవంతం కావాలంటూ బ్యానర్లు కట్టారు. నూతనంగా నిర్మిస్తున్న ఫ్లైఓవర్‌పై ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అనుచరులు బ్యానర్లతో నింపేశారు.
అధికారులు వారిస్తున్నా..
దుర్గగుడికి చెందిన ఆస్తులపై బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బ్యానర్లు కట్టవద్దంటూ దేవస్థానం ఇంజినీరింగ్ విభాగం అధికారులు, సిబ్బంది వారించారు. పర్గోలాకు కట్టిన బ్యానర్లు తీయించారు. ఆ నేపథ్యంలో వారి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాగా దుర్గాఘాట్, ఎదురుగానూ, అన్నదాన భవనం గేట్‌లకు ఉన్న బ్యానర్లు మాత్రం తొలగించలేదు. వాటిని అలాగే ఉంచడం వెనుకు ఎమ్మెల్సీ వత్తిడి ఉందని ప్రచారం జరుగుతోంది.
కోటి దీపోత్సవంలోనూ..
హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు ఆధ్వర్యంలో గురువారం కోటి దీపోత్సవం జరిగింది. అక్కడ కూడా ఆనందసూర్య అనుచరులు ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణకు చెందిన కరపత్రాలు పంచడంపై మహిళలు చికాకు పడ్డారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ అయినంత మాత్రాన కోటి దీపోత్సవంలోనూ, దుర్గగుడిపైనా ఆయన పెత్తనం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. నాలుగున్నర ఏళ్లలో అధికార తెలుగుదేశం పార్టీ నేతలు దేవస్థానానికి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి రాబట్టలేకపోయారు. అయితే ఇక్కడ పెత్తనం మాత్రం జోరుగా చేస్తున్నారు. దేవస్థానంలో ఏ చిన్న వివాదం జరిగినా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తలదూర్చుతారు. ఇక ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రతినిధులు కూడా దుర్గగుడిలో హవా నడిపేందుకు తహతహలాడుతూ ఉంటారు. ఇప్పుడు ఏకంగా దేవస్థానం ఆస్తులపై బ్యానర్లు వెలవడం పై భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment