సమైక్య రాష్ట్ర ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కే.చంద్రశేఖరరావుకు చుక్కలు చూపించాలని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సీమాంధ్రవాసులకు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన సమైక్య ఉద్యమంలో జగ్గయ్యపేటలో నిర్వహించిన జాతీయ రహదారి ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం ఆయన ప్రసంగిస్తూ... రాష్ట్ర విభజన జరిగితే అదాయం అంతా తెలంగాణ ప్రాంతానికి పోతుందన్నారు. అలాగే నీటీ సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. దాంతో సీమాంధ్ర ప్రాంతం ఎడారిగా మారుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా సీమాంధ్ర ప్రాంత వాసులు ఉద్యోగ అవకాశాలు కోల్పోతారన్నారు. అంతా కలసికట్టుగా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసుకున్నామని లగడపాటి రాజగోపాల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. సమైక్య ఉద్యమం బలంగా ఉంటే అంధ్రప్రదేశ్ రా్ష్ట్రం విడిపోదని ఆయన స్పష్టం చేశారు.