పార్వతీపురం టౌన్, న్యూస్‌లైన్: పేరుకే అది సంస్కృత పాఠశాల ....అక్కడ కొంతమంది ఉపాధ్యాయులు ఆ దేవనాగరి భాష నేర్పిన సంస్కృతిని మరిచి, పశువుల కన్నా హీనంగా ప్రవరిస్తున్నారు. చెల్లిగా, మాతృ సమానురాలిగా గౌరవించ వలసిన తోటి ఉపాధ్యాయురాలి పట్ల అత్యంత హేయంగా లైంగిక వేధింపులు కు దిగారు. మానసికంగా తీవ్రంగా వేధించారు. ఆరు నెలల క్రితం వరకూ ఓ టీచర్ వెంటపడితే, అతని నుంచి ఎలాగోలా ఆమె తప్పించుకుంది. ఇప్పుడు పాఠశాలను క్రమశిక్షణలో నడపవలసిన ముఖ్య బాధ్యతలు నిర్వహిస్తున్న హెచ్‌ఎం దారితప్పాడు. ఆమెను వేధించడం ప్రారంభించాడు, చివరకు భౌతికదాడికి దిగాడు.
గతంలో స్థానిక టీఆర్‌ఎం గర్ల్స్ హైస్కూల్ విద్యార్థినుల పట్ల కూడా అక్కడ కొంతమంది ఉపాధ్యాయులు అసభ్యకరంగా ప్రవర్తించారు. గురుతర బాధ్యతతో మెలగవలసిన ఉపాధ్యాయులే ఇలా ప్రవర్తించడంతో తమ పిల్లల భవిష్యత్ ఏం కావాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. హెచ్‌ఎంపై ఆ ఉపాధ్యాయురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కీచక పర్వం వెలుగుచూసింది.
చాలా కాలంగా ...
స్థానిక మున్సిపాలిటీ సంస్కృత ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉపాధ్యాయురాలిని అక్కడి ప్రధానోపాధ్యాయుడు చాలా కాలంగా లైంగికంగా వేధిస్తున్నాడు. హెచ్‌ఎం ప్రవర్తనపై ఆమె తోటి ఉపాధ్యాయుల వద్ద మొరపెట్టుకుంది. అయితే వారు తమ నిస్సహాయతను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం తనపై హెచ్‌ఎం వేధింపులకు, దాడికి దిగినట్టు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయమై రాజీ చేసేందుకు కొంతమంది యత్నిస్తున్నట్టు తెలిసింది. గతంలో కూడా ఇదే ఉపాధ్యాయునిని ఇదే స్కూల్‌లో పనిచేసిన ఓ ఉపాధ్యాయుడు లైంగికంగా వేధించడంతో ఆమె స్థానిక పెద్దలను ఆశ్రయించారు. వారు తీవ్రంగా హెచ్చరించడంతో ఆ ఉపాధ్యాయుడు వేధింపులను విరమించుకున్నట్టు సమాచారం. ఆ తరువాత హెడ్మాస్టర్ వేధిం పులకు పాల్పడుతున్నట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నాం...
ఈ విషయమై ఎస్‌ఐ డి.దీనబంధు వద్ద ప్రస్తావించగా స్థానిక సంకావీధిలోని మున్సిపల్ సంస్కృత పాఠశాలలో పనిచేస్తున్న హెచ్‌ఎం ఎం.నాగభూషణం తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆ పాఠశాలలో ఓ ఉపాధ్యాయురాలు తమకు ఫిర్యాదు చేశారన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
రిక్వెస్ట్...దయచేసి వదిలేయండి...
ఈ విషయమై హెచ్‌ఎం నాగభూషణం వద్ద ప్రస్తావించగా రిక్వెస్ట్...దయచేసి వదిలేయండంటూ ప్రాథేయపడ్డారు. హెచ్‌ఎం కుటుంబ సభ్యులు పట్టణంలోని అధికార పార్టీకి చెందిన ఓ పెద్దమనిషి పేరు చెబుతూ ఫోన్ చేయండంటూ కేకలు వేశారు.
ఇప్పటికీ తేలని టీఆర్‌ఎం గర్ల్స్ హైస్కూల్ వ్యవహారం
పార్వతీపురంలో మున్సిపాలిటీలోని టీఆర్‌ఎం గర్ల్స్ హైస్కూల్‌లో కొంతమంది విద్యార్థుల పట్ల ఆ పాఠశాల ఉపాధ్యాయులు కొందరు అసభ్యకరంగా ప్రవర్తించారు. బాధితులు నేరుగా ఐటీడీఏ పీఓకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఆ పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థినుల పట్ల ఆ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు కీచక చర్యలకు పాల్పడగా, భరించలేని వారు నేరుగా అప్పటి మున్సిపల్ ప్రత్యేకాధికారి, ఐటీడీఏ పీఓ బీఆర్ అంబేద్కర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన మున్సిపల్ కమిషనర్‌కు విచారణకు ఆదేశించగా, రాజకీయ పలుకుబడి కలిగిన ఆ ఉపాధ్యాయులు నేరుగా కమిషనర్‌ను అధికార పార్టీ నేతలతో బెదిరించినట్లు సమాచారం. దీంతో ఆ విచారణ బుట్టదాఖలయినట్లు తె లుస్తోంది. ఇలా ఒకటీ అరా వెలుగు చూసినప్పటికీ రాజకీయ పలుకుబడితో ఉపాధ్యాయులు కీచక చర్యలు మానుకోవడం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
సంస్కృత పాఠశాలలో....విష సంస్కృతి!
Published Sat, Dec 14 2013 4:00 AM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM
Advertisement
Advertisement