సాక్షి, రంగారెడ్డి జిల్లా: అభివృద్ధి అనేది విద్యపైనే ఆధారపడి ఉందని, విద్యావ్యవస్థ సక్రమంగా పనిచేస్తేనే సమాజం ముందుకు సాగుతుందని, ఇందుకు ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో పనిచేయాల్సి ఉంటుందని తెలంగాణ రాజకీయ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు.
ఆదివారం సరూర్‌నగర్‌లో రాష్ట్రోపాధ్యాయ సంఘం ‘తెలంగాణ పునర్‌నిర్మాణం-ఉపాధ్యాయుల పాత్ర’ అనే అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమర్థవంతంగా పనిచేసి విద్యావంతమైన సమాజాన్ని నెలకొల్పవచ్చన్నారు.
తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయులు ప్రధాన భూమిక పోషించారని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన ఘనత ఉపాధ్యాయులదేనన్నారు. ఈ సదస్సులో రాజకీయ విశ్లేషకులు చక్రపాణి, ఆ సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పున్నకుమార్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సదానంద్, ప్రవీణ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఏవీ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.