ఉపన్యాసాలే తప్ప మీరు చేసిందేమిటి?
⇒ కోదండరామ్‌కు టీజేఏసీ అసంతృప్త నేతల బహిరంగ లేఖ
⇒ వివిధ జిల్లాలకు చెందిన 22 మంది సమావేశం
⇒ ఉద్యమకారులకు న్యాయం చేయడం లేదని ఆరోపణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం లోనూ, రాష్ట్రం ఏర్పాటయ్యాక కూడా ఉపన్యా సాలు ఇవ్వడంతప్ప టీజేఏసీ చైర్మన్ కోదండరాం చేసిందేమీ లేదని జేఏసీ అసం తృప్తి నేతలు ఆరోపించారు. జేఏసీ కో–చైర్మన్ నల్లపు ప్రహ్లాద్ అధ్యక్షతన కన్వీనర్ పిట్టల రవీందర్, కో–కన్వీనర్ తన్వీర్ సుల్తానా సహా వివిధ జిల్లాలకు చెందిన 22 మంది జేఏసీ నేతలు హైదరాబాద్‌లోని అశోకా హోటల్‌లో సోమవారం సమావేశమయ్యారు. అనంతరం సమావేశం వివరాలను, కోదండరామ్‌కు రాసిన లేఖను మీడియాకు విడుదల చేశారు. నల్లపు ప్రహ్లాద్, పిట్టల రవీందర్, తన్వీర్ సుల్తానా రాసిన లేఖను సమావేశం ఏకగ్రీ వంగా సమర్థించినట్టుగా వెల్లడించారు.
నియామాలకు విరుద్ధం..
జేఏసీ రూపొందించుకున్న నిబంధనలకు విరుద్ధంగా కోదండరాం వ్యవహరిస్తున్నారని నేతలు తమ లేఖలో ఆరోపించారు. టీ జేఏసీ రాజకీయపార్టీలతో కలసి పనిచేయ దని, రాజకీయ పార్టీగా మారదని ప్రకటి స్తూనే.. రాజకీయ పార్టీలతో, రాజకీయ నాయకులతో కోదండరాం అంటకాగుతున్నా రని విమర్శించారు. తెలంగాణ సామాజిక సమన్యాయ సాధనలో ఒక ప్రత్యేక కార్యా చరణను ఎందుకు రూపొందించుకోలేదని... ఇంతవరకూ ఒక్క కార్యక్రమాన్ని కూడా ఎందుకు నిర్వహించలేదని నిలదీశారు. జేఏసీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛగా అభిప్రాయాలను వ్యక్తం చేయ డానికి కనీస అవకాశాల్లేవని.. కోదండరాం అనుసరిస్తున్న స్వీయ అస్తిత్వ ధోరణితో ఇది స్పష్టమవుతోందన్నారు.
ఉద్యమకారులు ఇంకా నష్టపోతున్నారు...
ఉద్యమకారులు ఇంకా అనేక విధాలుగా నష్టపోతున్నారని, అణచివేత అనుభవిస్తున్నారని.. దీనికి కోదండరాం వైఖరే కారణమని నేతలు విమర్శించారు. వారికి న్యాయం జరిగే విధంగా వ్యవహరించాల్సిన బాధ్యత కోదండరాంపై ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో మహిళలు నిర్వహించిన పాత్ర గొప్పదని, కానీ వారికి సంబంధించిన ఏ అం శాన్నీ జేఏసీ ప్రస్తావించలేదని పేర్కొన్నారు. జేఏసీలో తాము వ్యక్తం చేసిన అభిప్రాయా లకు సమాధానం రాకపోవడంతో ఇలాంటి కీలకాంశాలపై అంతర్గత చర్చకు అవకాశం లేదని స్పష్టమైందని, అందుకే బహిరంగలేఖ రాస్తున్నామని నేతలు ప్రకటించారు.
ఈ సమావేశంలో స్టీరింగ్ కమిటీ సభ్యులు సి.రాంచందర్, చొప్పరి శంకర్ ముదిరాజ్, ఆదిలాబాద్ జిల్లా జేఏసీ చైర్మన్ దుర్గం రాజేశ్, ఎం.మధుసూదన్‌బాబు (గద్వాల జిల్లా కో–కన్వీనర్), తొగరి బాబూరావు (భూపాలపల్లి జిల్లా కన్వీనర్), నాగుర్ల సంజీవరావు (మేడ్చల్ జిల్లా కన్వీనర్), ఆకుల మహేందర్(పెద్దపల్లి), వెంకట మల్లయ్య (జేఏసీ కరీంనగర్ జిల్లా చైర్మన్), శ్రీనివాస్ (రంగారెడ్డి మాజీ చైర్మన్), సదానందం(రంగారెడ్డి జిల్లా మాజీ కన్వీనర్), ముకుంద నాగేశ్వర్ (పరిగి), పూల్‌సింగ్ (మంథని), రవీందర్ (హైదరాబాద్, పాతబస్తీ), సుభద్ర (సిరిసిల్ల జిల్లా జేఏసీ కోకన్వీనర్), తుమ్మల సుమిత్ర, పుష్పలత, వరలక్ష్మి, లలిత (కరీంనగర్ జిల్లా మహిళా జేఏసీ) తదితరులు పాల్గొన్నారు.
కోదండరాం వైఖరితో అన్యాయం
తెలంగాణ ఉద్యమం, పునర్నిర్మాణ సందర్భంలోనూ కోదండరాం చేసిందేమీ లేదని నేతలు తమ లేఖలో ఆరోపించారు. ఉద్యమ, పౌర సంఘాలు ఏర్పాటు చేసిన సభలు, సమావేశాల కు వచ్చి ఉపన్యాసాలు ఇచ్చిపోవడంతప్ప ఆయన పాత్రేమీ లేదన్నారు. ఉద్యమ సమయంలో ప్రజాసంఘాలు, విద్యార్థి, కుల, మహిళా, యువజన సంఘాలు, జేఏసీ కార్యకర్తలు, నేతలు నిర్వహించిన పాత్రను కోదండరాం ఏనాడూ ప్రస్తావించలేదన్నారు. ఉద్యమంలో అనేకమంది నేతలు ఆర్థికంగా, వ్యక్తిగతంగా ఎంతో నష్టపోయారని.. వారికి న్యాయం చేయడానికి కోదండరాం ఎలాంటి ప్రయత్నం చేయలేదని ఆరోపించారు.