ఒంగోలు టౌన్: గత ఏడాది సాధించిన ఫలితాలతో ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించేందుకు అనేక మంది తల్లిదండ్రులు ముందుకు వచ్చారు. దాంతో ఒక్కసారిగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సంఖ్య పెరిగింది. ప్రభుత్వ పాఠశాలలు పూర్వ వైభవాన్ని సంతరించుకునే సమయంలో సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వమే మోకాలొడ్డింది. తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ముచేసేలా వ్యవహరించింది. ఎంతో ఆశతో తమ పిల్లలను ప్రభుత్వ రెండు నెలలు దాటడంతో తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించే అవకాశం లేక విద్యార్థుల తల్లిదండ్రులను ప్రభుత్వం సందిగ్ధంలో పడేసింది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల షార్ట్, పాఠ్య పుస్తకాలు లేట్‌గా రావడంతో విద్యార్థుల కంటే ఉపాధ్యాయులకే అసలైన పరీక్షా కాలం వచ్చినట్లయింది. మరికొన్ని రోజుల్లో సమ్మెటివ్–1 పరీక్షలు ప్రారంభం కానుండటంతో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు సగం సిలబస్‌తో ఆ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్‌కు చెందిన విద్యార్థులు సమ్మెటివ్–1కు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావడం విశేషం.
డీఎస్సీ డ్రామా..
గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏటా డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయుల పోస్టులన్నీ భర్తీ చేస్తానంటూ నిరుద్యోగ అభ్యర్థులకు వాగ్దానం చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటినా ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదు. డీఎస్సీకి సంబంధిత మంత్రితో ప్రకటన చేయించడం, నోటిఫికేషన్ జారీ చేసిన తరువాత ఏదో ఒక కొర్రీ వేసి దానికి బ్రేక్‌లు వేయడం పరిపాటిగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది డీఈడీ, బీఈడీ అభ్యర్థులు డీఎస్సీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీలు ఏడాదికేడాది పెరిగిపోతూనే ఉన్నాయి. జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్, ల్యాంగ్వేజి పండిట్, పీఈటీలకు సంబంధించి మొత్తం 12,655 పోస్టులు ఉన్నాయి.
వీటిలో 810కి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి తెలుగు సబ్జెక్టులో 291 పోస్టులు, హిందీ సబ్జెక్టులో 220 మంది ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎస్‌జీటీలకు సంబంధించి తెలుగు సబ్జెక్టులో 184 మంది ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సోషల్ స్టడీస్‌లో 37 పోస్టులు, బయోలాజికల్ సైన్స్‌లో 21 పోస్టులు, మ్యాథ్స్‌కు 14 పోస్టులు, ఇంగ్లిష్‌కు 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో పదుల సంఖ్యలో ఉన్నత పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయలు ఉద్యోగ విరమణ చేశారు. దాంతో పెద్ద సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉండటంతో ప్రస్తుతం పనిచేసే ఉపాధ్యాయులపై అదనపు భారం పడింది.
ప్రహసనంగా పాఠ్య పుస్తకాలు:
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు పాఠ్య పుస్తకాల పంపిణీ ప్రహసనంగా మారింది. ఏటా వేసవి సెలవుల్లో పాఠ్య పుస్తకాలను ముద్రించి జిల్లాలోని డిపోలకు సరఫరా చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఏనాడూ సకాలంలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించిన దాఖలాలు లేవు. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభించిన రెండున్నర నెలల తరువాతే విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు అందించగలిగారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు 4 లక్షల 68 వేల మంది విద్యార్థులు నమోదై ఉన్నారు. వీరిలో ప్రాథమికోన్నత పాఠశాలల్లో 56,541 మంది ఉండగా, ఉన్నత పాఠశాలల్లో 2 లక్షల 18 వేల 128 మంది విద్యార్థులు ఉన్నారు.
ఒకటి నుంచి పదో తరగతి వరకు 18 లక్షల 42 వేల 462 పాఠ్య పుస్తకాలు అవసరం అవుతాయని జిల్లా విద్యాశాఖ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. గత ఏడాదికి సంబంధించి లక్షా 39 వేల 596 పాఠ్య పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. దీంతో ప్రింటర్ల నుంచి జిల్లాకు 16 లక్షల 74 వేల 200 పాఠ్య పుస్తకాలను జిల్లాలోని డిపోకు తరలించారు. ప్రైవేట్, కాన్వెంట్ స్కూల్స్‌లోని విద్యార్థులు విద్యా సంవత్సరం ప్రారంభించిన వారంలోపు పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాలతో తరగతులకు హాజరై పాఠాలు నేర్చుకుంటుంటే, ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మాత్రం పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాలు వచ్చేసరికి రెండున్నర నెలలు పట్టింది. దీంతో కొన్ని సబ్జెక్టులకు సంబంధించి విద్యార్థులు వెనుకబడిపోయారు. ఇది వచ్చే మార్జిన్‌లో జరిగే పరీక్షలపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.
‘యాప్’సోపాలు:
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ‘యాప్’సోపాలు పడుతున్నారు. ప్రతి దానికి ఓ యాప్ పెట్టి దాని ద్వారానే కార్యకలాపాలు తెలియజేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో అనేక మంది ఉపాధ్యాయులు పాఠాలు బోధించడం కంటే యాప్‌లకు సమాధానాలు చెప్పే సరికే పాఠశాల సమయం ముగిసిపోతోంది. గతంలో ఎన్నడూ లేనట్లు ప్రతిదానికి ఒక యాప్ పెట్టడంతో ఉపాధ్యాయులు ఎక్కువ సమయం యాప్‌ల ద్వారా వివరాలు పంపించడానికే సరిపోతోంది. ప్రతిరోజూ పాఠశాలకు వచ్చిన విద్యార్థుల సంఖ్య, ఎంతమంది మధ్యాహ్న భోజనం చేశారో ఆ వివరాలను యాప్ ద్వారా అధికారులకు పంపించాలి. స్వచ్ఛతా యాప్, స్వచ్ఛ విద్యాలయ యాప్‌లకు వివరాలు అందించాలి. యూనిఫారాలు అందించే ప్రతిసారీ విద్యార్థి బయోమెట్రిక్ తీసుకొని ఫొటో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
సమ్మెటివ్ అసెస్‌మెంట్ పరీక్షల ఫలితాలు యాప్‌లో నమోదు చేయాలి. విద్యార్థుల స్కాలర్‌షిప్, గ్రీన్ కోర్ కమిటీల వివరాలు, మొక్కలకు జియోట్యాగింగ్ యాప్ ద్వారా పంపాలి. సిగ్నల్ సమస్య తలెత్తితే అది కలిసే వరకు ఉపాధ్యాయులు సిగ్నల్ కోసం చూస్తుండటంతో విద్యార్థులకు పాఠాలు చెప్పే సమయం తగ్గిపోతోంది. ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకాల కంటే సెల్‌ఫోన్లు చూసుకునేందుకే ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సిన పరిస్థితిని ప్రభుత్వం కల్పించింది. ఒకవైపు ఉపాధ్యాయుల కొరత, మరోవైపు యాప్‌ల గోలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్య కుంటుపడుతోంది. ఈ విషయాన్ని ఉపాధ్యాయులు కూడా అంగీకరిస్తుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment