
బెజవాడలో సాప్ట్‌వేర్ ఇంజినీర్ అదృశ్యం
విజయవాడ: నగరానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అదృశ్యం కావడంతో అతని కుటుంబసభ్యులు పోలీసుల్ని ఆశ్రయించారు. వన్‌టౌన్ పోలీసుల వివరాల ప్రకారం ప్రసాదంపాడుకు చెందిన సంతోష్‌కుమార్ సోదరుడు నాగసాయి (25) హైదరాబాద్‌లోని సీజీఐ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. అతడు ఈ నెల ఆరో తేదీన విజయవాడ వచ్చాడు. శనివారం రాత్రి ఏడు గంటలకు బైక్‌పై బయటకు వెళ్లాడు. కొద్దిసేపటికి తన అన్న వాట్సప్‌కు తాను ప్రకాశం బ్యారేజీపై నుంచి దూకి చనిపోతున్నానని, తన శరీరం కృష్ణానదిలోంచి తీసుకోవాలంటూ మెసేజ్ పంపాడు.
దీంతో తమ్ముడి ఆచూకీ కోసం కుటుంబసభ్యులు ఆరా తీసినా ఫలితం లేకపోయింది. దీంతో వారు పోలీసుల్ని ఆశ్రయించారు. కాగా నాగసాయి పని ఒత్తిడికి గురి అవుతున్నాడని, అందుకే ప్రశాంతత కోసం తిరుపతి కూడా వెళ్లి వచ్చారని కుటుంబసభ్యులు చెబుతున్నారు. మరోవైపు నాగసాయి ఫేస్‌బుక్ లైవ్‌లోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతని ఫోన్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. పని ఒత్తిడి కారణంగానా లేక ప్రేమ వ్యవహారం ఏదైనా ఉందా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.