యుక్త వయసున్న బాలికలను గుర్తించి వారికి అవసరమైన హిమోగ్లోబిన్ , పౌష్టికాహారం తదితర
విశాఖపట్నం (మహారాణిపేట): యుక్త వయసున్న బాలికలను గుర్తించి వారికి అవసరమైన హిమోగ్లోబిన్ , పౌష్టికాహారం తదితర కార్యక్రమాలకు ప్రణాళికలను సిద్ధం చేయాలని కలెక్టర్ ఎన్.యువరాజ్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన యుక్తవయసు బాలబాలికల కో ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 10-19 వయస్సున్న వారు 8.8 లక్షల మంది ఉన్నారన్నారు. వీరికోసం ప్రత్యేకంగా యునిసెఫ్ ప్రాజెక్ట్ తీసుకున్నామన్నారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రభుత్వ,ప్రైవేటు ఆశ్రమ, రెసిడెన్షియల్ , కస్తూర్భా గాంధీ పాఠశాలలను పరిశీలించి అక్కడ పిల్లల ఆరోగ్య విషయాల గురించి తెలుసుకోవాలన్నారు. ఇందుకు వైద్యారోగ్యం, అంగన్‌వాడీ, స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు ఒక కమిటీగా ఏర్పడి సంవత్సరానికి సంబంధించిన యాక్షన్‌ప్లాన్ సిద్ధం చేయాలన్నారు.
యుక్తవయసు బాలబాలికలందరికి ఏడాదికి రెండుసార్లు హిమోగ్లోబిన్ పరీక్షలు చేయాలన్నారు. ఆ రిపోర్ట్‌లను సాఫ్ట్‌వేర్‌లో పొందుపరచాలన్నారు. బాలికలకు వ్యక్తిగత పరిశుభ్రత, శానిటరీ నాప్కిన్ల వినియోగం పై అవగాహన కల్పించాలన్నారు. టీంలు మండలాల వారీగా ఏర్పడి అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. రెడ్‌క్రాస్ సొసైటీ వారి సహకారాన్ని కూడా తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ జనార్దన్ నివాస్, ఐసీడీఎస్ పీడీ చిన్మయిదేవి, డీఎల్‌ఓ డాక్టర్ రమేశ్, సహాయ గిరిజన సంక్షేమ అధికారి శ్రీదేవి, గ్రీన్ వ్యాలీ సంస్థ ప్రతినిధి ప్రభాకర్, యునిసెఫ్ కోఆర్టినేటర్ సీమా కుమార్, స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు నరేశ్, అబ్దుల్ రఖీద్ పాల్గొన్నారు.