సాక్షి ప్రతినిధి, కర్నూలు: తహశీల్దార్ల బదిలీలకు అధికార పార్టీ నేతలు రేటు కట్టారు. ఆయా మండలాల్లో వచ్చే ఆదాయాన్ని బట్టి ధర నిర్ణయించారు. ముడుపులు ముట్టజెప్పిన వారికి కోరిన చోట పోస్టింగ్ ఇచ్చేశారు. పాలనలో పారదర్శకత తీసుకొచ్చేందుకు కలెక్టర్, జేసీ చేసిన ప్రయత్నాలకు పాతరేశారు. కొన్ని సిఫారసులు మినహాయించి.. గుట్టుచప్పుడు కాకుండా బదిలీల ప్రక్రియ పూర్తి చేసిన ఆనందం అంతలోనే ఆవిరైంది.
గతనెల 29వ తేదీ అర్ధరాత్రి 1-2 గంటల వరకు కూర్చొని కసరత్తు చేసి, బదిలీల ఉత్తర్వులను 30న అందరికీ మెయిల్ చేశారు. అయితే, కొందరు తహశీల్దార్లు 31వ తేదీ రాత్రి 9 గంటలకు బదిలీల ఆర్డర్లను రద్దు చేయించుకున్నారంటే తెరవెనుక ఎంత బాగోతం నడిచిందో ఇట్టే అర్థమవుతోంది. బదిలీ ఆర్డరు చేతికంది ఐదు రోజులు గడుస్తున్నా ఇప్పటికీ విధుల్లో చేరని పలువురు తహశీల్దార్లు అనువైన పోస్టింగ్ కోసం అధికార పార్టీ నేతల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరో వారం రోజుల్లో బదిలీలు తప్పవని చర్చ జరుగుతోంది.
అక్కడికైతే రూన.50 లక్షలిస్తా
తహశీల్దార్ల బదిలీల్లో అధికార పార్టీ నేతల వసూళ్ల బాగోతం తెలిసిన ఓ తహశీల్దార్ ఏకంగా కర్నూలుకు బదిలీ చేస్తే రూ.50 లక్షలు ఇచ్చేందుకు ముందుకు రావడం బదిలీల బాగోతానికి పరాకాష్టగా నిలుస్తోంది. అయితే, సదరు తహశీల్దార్ ఇప్పటికే ఏసీబీ కేసులో ఇరుక్కున్న నేపథ్యంలో ఆ ప్రతిపాదనకు అధికార పార్టీ నేతలు పునరాలోచనలో పడ్డారు. వచ్చిన బేరం పోగొట్టుకోవడం ఎందుకని... మరో ఫోకల్ పోస్టును చూసుకోమన్నట్లు తెలుస్తోంది.
ఆ మేరకు కాస్త ధర తగ్గించి మరోచోట సదరు తహశీల్దార్ పోస్టింగ్ తెచ్చుకోవడం గమనార్హం. మొదటి రోజు 43 మంది తహశీల్దార్లను బదిలీ చేసిన అధికార యంత్రాంగం... 24 గంటలు గడవక ముందే ఆరుగురి బదిలీల్లో మార్పు చేసింది. మరో వారం రోజుల్లో మళ్లీ బదిలీల్లో మార్పులు తప్పవనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఇసుక, మైనింగ్ ప్రాంతాలకు భారీ డిమాండ్
జిల్లాలో ఇసుక, మైనింగ్ ప్రాంతాలతో పాటు మునిసిపాలిటీ ప్రాంతాల్లో ఎమ్మార్వో పోస్టులకు బారీగా డిమాండ్ ఉంది. అక్రమ ఇసుక తవ్వకాలతో పాటు మైనింగ్‌ను చూసీ చూడనట్టు ఉండేందుకు మైనింగ్, ఇసుక మాఫియా ద్వారా ప్రతీ నెలా ఠంచనుగా లక్షలాది రూపాయలు అందుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. తాజాగా పరిశ్రమలకు కేంద్రంగా మారుతున్న ఓర్వకల్లు ప్రాంతానికి కూడా గిరాకీ పెరిగింది. కర్నూలు, నంద్యాల, కల్లూరు, ఆదోని, డోన్, బేతంచర్ల, ఓర్వకల్లు ప్రాంతాలకు బదిలీ చేయించుకునేందుకు అనేక మంది తహశీల్దార్లు అధికార పార్టీ నేతల చుట్టూ సూట్‌కేసులతో చక్కర్లు కొడుతుండటం గమనార్హం.
ఇవీ బది‘లీలలు’
కల్లూరు ఎమ్మార్వోగా ఉన్న సమయంలో ఏసీబీ కేసులో ఇరుక్కున్న ఓ అధికారిణిని అప్పట్లో కోనేరు రంగారావు కమిటీ (కేఆర్‌ఆర్‌సీ)కి వేశారు. అయితే, ఆమె రాజకీయ సిఫార్సుతో ఏకంగా మంత్రి లెటర్ పెట్టి మరీ పాణ్యం మండలానికి బదిలీ చేయించుకోగలిగారు.
ప్యాపిలి ఎమ్మార్వోగా ఉన్న తులసీనాయక్‌ను గత నెల చివర్లో బదిలీ చేసి, ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. కలెక్టరేట్‌లో రిపోర్టు చేసుకోవాలని ఆదేశించారు. అయితే, ఆయన రాజకీయ అండదండలతో మళ్లీ ప్యాపిలీకే బదిలీ చేయించుకోగలిగారు.
మహానందిలో ఉన్న నరసింహులును డోన్‌కు బదిలీ చేశారు. మంచి ఫోకల్ పోస్టు కావడంతో డిమాండ్ పెరిగింది. తిరిగి ఈ పోస్టుకు బాలగణేషయ్యను పంపారు. నరసింహులును నందికొట్కూరుకు బదిలీ చేశారు.
నంద్యాల తహశీల్దార్ శివరాంరెడ్డిని బనగానపల్లె తహశీల్దార్‌గా నియమించారు. పత్తికొండ రామకృష్ణను నంద్యాలకు బదిలీ చేశారు. రెండోసారి చేపట్టిన బదిలీల్లో శివరాంరెడ్డిని మళ్లీ నంద్యాలకు మార్చారు. రామకృష్ణను బనగానపల్లెకు పంపారు.
వెలుగోడు నుంచి మిడుతూరుకు వేసిన తిరుమలవాణిని తిరిగి వేలుగోడుకు మార్చారు. జూపాడుబంగ్లాకు బదిలీ అయిన సుజాతను మిడుతూరు మండలానికి బదిలీ చేశారు.
కల్లూరులోని శివరాముడు రాజకీయ పలుకుబడితో అక్కడే కొనసాగుతున్నారనే ప్రచారం జరుగుతోంది.
తహశీల్దార్ల బదిలీల్లో ‘రాజకీయం'
Published Wed, Nov 5 2014 3:24 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM
Advertisement
Advertisement