ఏపీ వైపు లాంచీ స్టేషన్ మూసివేశారంటూ దుష్ప్రచారం చేయటంతో తెలంగాణ వైపు నిలిచిన వాహనాలు
► తెలంగాణ టూరిజం సిబ్బంది నిర్వాకం
► ఏపీ టూరిజం లాంచీలు మూసేశారంటూ దుష్ప్రచారం
విజయపురి సౌత్: ఇటీవల షరతులతో కూడిన అనుమతులతో నాగార్జున కొండకు తెలంగాణ లాంచీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతించింది. అయితే అధిక ఆదాయం ఆర్జించేందుకు తెలంగాణ టూరిజం సిబ్బంది నాగార్జునసాగర్ హిల్‌కాలనీ మీదుగా ఏపీ వైపు వచ్చే పర్యాటకుల వాహనాలను అడ్డుకుంటున్నారు. గుంటూరు జిల్లాలోని విజయపురిసౌత్‌లో ప్రముఖ ప్రదేశాలను తిలకించేందుకు నిత్యం వందలాది మంది పర్యాటకులు హైదరాబాద్ నుంచి వస్తుంటారు.
విజయపురి సౌత్‌లోని లాంచీ స్టేషన్ నుంచి లాంచీ సర్వీసులు పర్యాటకులను కొండకు చేరవేస్తుంటాయి. ఇక్కడ లాంచీ స్టేషన్ నుంచి నాగార్జున కొండ వెళ్లేందుకు పర్యాటకులకు ఎంతో అనువుగా ఉంటుంది. అయితే నల్గొండ జిల్లా హిల్‌కాలనీ సాగర్ ఎర్త్ డ్యాం వద్ద తెలంగాణ టూరిజం అధికారులు రెండు లాంచీ సర్వీసులను నాగార్జునకొండకు ఏర్పాటు చేశారు. ఆ లాంచీలలో నాగార్జున కొండకు వెళ్తే తెలంగాణకు ఆదాయం లభిస్తుందనే ఉద్దేశంతో అక్కడి టూరిజం సిబ్బంది.. ఏపీలోని లాంచీ స్టేషన్ మూసివేశారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. దీంతో తెలంగాణ పర్యాటకులు ఏపీ వైపు రావటం లేదు. తెలంగాణ టూరిజం సిబ్బంది ఏపీ వైపు వచ్చే వాహనాలను అడ్డుకోవటంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి దుష్ప్రచారాలను మానుకోవాలని హెచ్చరిస్తున్నారు.