బంద్ సంపూర్ణం | Telangana Bandh Successful in Nizamabad Dist | Sakshi
Sakshi News home page

బంద్ సంపూర్ణం

Published Fri, Dec 6 2013 4:41 AM | Last Updated on Sat, Sep 2 2017 1:17 AM

Telangana Bandh Successful in Nizamabad Dist

 సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జీవోఎం ప్రతిపాదించిన రాయ ల తెలంగాణను వ్యతిరేకిస్తూ టీఆర్‌ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు గురువా రం జిల్లాలో బంద్ సంపూర్ణంగా విజ యవంతమైంది. ఎన్నడూ లేనివిధం గా నియోజకవర్గం, మండల కేంద్రా లు, గ్రామాల్లో ప్రజలు, తెలంగాణ వాదులు పార్టీలకతీతంగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను ఊరేగించి దహనం చేశారు. ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, కార్మికులు, కర్షకులు రాయల తెలంగాణకు వ్యతిరేకంగా కదం తొక్కారు. న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన ప్రదర్శన చేశారు. ఆర్టీసీ కార్మికులు బంద్‌కు మద్దతుగా ఒక్క రోజు సమ్మెలో పాల్గొన్నారు. జిల్లాలోని ఆరు డిపోల నుంచి ఒక్కబస్సు కూడా రోడ్డెక్కని పరిస్థితి ఏర్పడింది. టీఆర్‌ఎస్, బీజేపీ, న్యూడెమోక్రసీ, సీపీఐ నాయకులు, కార్యకర్తలు జిల్లా బంద్‌ను విజయవంతం చేయడంలో తమ వంతు పాత్రను పోషించారు. పీడీఎస్‌యూ, ఏబీవీపీ, ఏఐఎస్‌ఎఫ్, టీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో విద్యార్థులు తరగతులను బహిష్కరించి ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు.
 
 ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసు యంత్రాంగం పట్టణాలు, నియోజక వర్గం, మండల కేంద్రాల్లో బందోబస్తును నిర్వహించింది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగలవని భావించిన ప్రాంతాల్లో పోలీస్ పికెట్‌లను ఏర్పాటు చేశారు. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. బస్సులు తిరగనందున ఆర్టీసీ రూ. 60 లక్షల ఆదాయం కోల్పోయింది. కలెక్టరేట్‌లోని ఉద్యోగులు, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు, సిబ్బంది బంద్‌కు మద్దతుగా ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విద్య, వ్యాపార, వాణిజ్య సంస్థలు, పెట్రోలు బంకులు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌ను పాటించాయి. సినిమా థియేటర్లలో ఉదయం ఆటలు నిలిపివేశారు. నిజామాబాద్‌లో మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి ఇంటిని ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ముట్టడించారు.
 
 భారీ పోలీసు బందోబస్తును లెక్కచేయకుండా విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ నీతిని నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నగరంలో రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు బస్టాండ్ ఎదుట బైఠాయించారు. భారీ ర్యాలీ నిర్వహించి, ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పది మంది ఏఐఎస్‌ఎఫ్ నాయకులతో పాటు వివిధ పార్టీలకు చెందిన 45 మందిని పోలీసులు అరెస్టు చేసి వ్యక్తిగత పూచీకత్తుపై సాయంత్రం విడిచి పెట్టారు. జిల్లా కోర్టు న్యాయవాదులు విధులను బహిష్కరించి కాంగ్రెస్ కార్యాలయాన్ని  ముట్టడించారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కామారెడ్డి, బాన్సువాడ, బోధన్, ఎల్లారెడ్డి, బిచ్కుంద ప్రాంతాల్లో న్యాయవాదులు విధులు బహిష్కరించి బంద్‌లో భాగస్వామ్యాన్ని పంచుకున్నారు.
 
 నిరసన ప్రదర్శన నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లాలో ఆరు ఆర్టీసీ డిపోలకు చెందిన 637 బస్సులు నిలిచి పోయాయి. ఆర్టీసీ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. ఆర్మూర్‌లో టీఆర్‌ఎస్ నేత జీవన్‌రెడ్డి తదితరులతో పాటు బీజేపీ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, పీడీఎస్‌యూ, న్యూడెమోక్రసీ చంద్రన్న వర్గం, సీపీఐ నాయకులు పాల్గొన్నారు. నందిపేటలో రాయల తెలంగాణకు నిరసనగా జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేశారు. బోధన్, కోటగిరి, ఎడపల్లి ప్రభుత్వ ఉపాధ్యాయులు శిక్షణ తరగతులు బహిష్కరించి నిరసన ర్యాలీ నిర్వహించారు. బోధన్, ఎడపల్లి, రెంజల్ మండల కేంద్రాల్లో టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి బంద్‌ను పర్యవేక్షించారు. బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజక వర్గాల కేంద్రాలతో పాటు మండలాల్లో బంద్ విజయవంతమైంది. బాన్సువాడలో బంద్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి పర్యవేక్షించారు. డిచ్‌పల్లిలో టీఆర్‌ఎస్ రూరల్ ఇన్‌చార్జి డాక్టర్ భూపతిరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు వ్యాపార, వాణిజ్య సంస్థలను మూసివేయించారు.  గన్నారం శివారులోని 44వ నెంబరు జాతీయ రహదారిపై టీడీపీ ఆధ్వర్యంలో కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
 
 తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థులు సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని రోడ్డుపైన బైఠాయించి ధర్నా నిర్వహించారు. జీవోఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ కోసం అమరుడైన రాములుకు నివాళులర్పించారు. కామారెడ్డి పట్టణంలో టీఆర్‌ఎస్, బీజేపీ, న్యూడెమోక్రసీ, సీపీఐల ఆధ్వర్యంలో కార్యకర్తలు బైక్ ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ ఆర్మూర్, కామారెడ్డిలో  జరిగిన ఆందోళనలో పాల్గొన్నారు. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తును నిర్వహించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement