
ఈ నెలాఖరులోగా అసెంబ్లీకి టి.బిల్లు: బొత్స
తెలంగాణ బిల్లు ఈ నెలాఖరుకల్లా అసెంబ్లీకి వస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ తమకు తెలిపారని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వెల్లడించారు. మంగళవారం బొత్స హైదరాబాద్లో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమం గ్రామాల్లో నిర్వహించాలని మొదట్లో తామంతా అనుకున్నామని తెలిపారు. అయితే రచ్చబండ కార్యక్రమం మండల కేంద్రాల్లో నిర్వహించాలని తమతో సీఎం కిరణ్ సూచించారని, దాంతో ఆ కార్యక్రమాన్ని మండల కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
సీఎం కార్యాలయానికి , గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పి.బాలరాజుల మధ్య సమాచారం లోపం ఉందని బొత్స అభిప్రాయపడ్డారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా సీఎం కిరణ్ విశాఖలో పలు గిరిజన సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఆ కార్యక్రమాలపై సీఎం కార్యాలయం తనకు సమాచారం అందించలేదని మంత్రి పి.బాలరాజు మీడియా సమావేశంలో ఆరోపించిన సంగతి తెలిసిందే.