విద్యార్థి నాయకుడి నుంచి మంత్రిగా ఎదిగిన నాయకుడు
వైఎస్సార్, జగన్ క్యాబినెట్లలో మంత్రిగా తనదైన ముద్ర
ఆయన పేరు బొత్స సత్యనారాయణ.. కానీ అందరూ ఆయనను అభిమానంగా సత్తిబాబు అని పిలుచుకుంటారు. విభిన్నమైన నాయకుడు బొత్స. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు అలంకరించారు. అన్నిటి కంటే అందరివాడుగా పేరు పొందడమే ఆయనకు పెద్ద అలంకారం. సామాన్యులు వెళ్లి తమ కష్టం చెప్పినా ఆయన వెంటనే స్పందించి వారి సమస్య పరిష్కరిస్తారని ప్రతిపక్షంలోని వారు సైతం చెప్పుకునే మాట. అలాంటి నాయకుడిని ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి పార్టీ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఉమ్మడి విశాఖ జిల్లా నాయకుల సమావేశంలో అందరి అభిప్రాయాలు తెలుసుకున్న పార్టీ అధినేత బొత్సను అభ్యర్థిగా ప్రకటించారు.
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ సీనియర్ రాజకీయ నాయకుడు. బలమైన ప్రజా మద్దతుతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఎలాంటి వివాదాన్నయినా సామరస్యంగా పరిష్కరించగల నేతగా పేరు. విశాఖ అభివృద్ధి కోసం.. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న యూనియన్ సంఘాలకు తన మద్దతు పలికారు. అంతేకాకుండా తన సతీమణీ ఎంపీగా ఉన్న సమయంలో విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ గురించి ఆనాడు పార్లమెంట్‌లో గళం వినిపించేలా చేశారు. గాజువాక అల్లుడిగా ఈ ప్రాంతంతో మరింత అనుబంధం బొత్స సత్యనారాయణకు ఉంది.
విద్యార్థి నాయకుడి నుంచి మంత్రిగా..
విజయనగరంలో బొత్స గురునాయుడు, ఈశ్వరమ్మ దంపతులకు 1958లో బొత్స సత్యనారాయణ జన్మించారు. ఆయన మహారాజా కళాశాలలో బీఏ డిగ్రీ పూర్తి చేశారు. ఆయన 1985లో బొత్స ఝాన్సీలక్ష్మీని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అబ్బాయి సందీప్, అమ్మాయి అనూష. రాజకీయ జీవితం విద్యార్థి దశ నుంచే ప్రారంభమైంది. 1978లో విద్యార్థి సంఘ నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చి అంచలంచెలుగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్‌గా ఎదిగారు.
ఆయన 1992 నుంచి 99 వరకు రెండుసార్లు విజయనగరం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్‌గా పనిచేశారు. 1999లో బొబ్బిలి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఆనాడు ఎన్డీయే హవా వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ నుంచి కేవలం ఐదుగురు ఎంపీలే గెలవగా అందులో బొత్స ఒకరు. 2004, 2009లలో చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రధాన అనుచరుడిగా ఆయనకు పేరుంది.
ఆయన వైఎస్సార్, రోశయ్య , కిరణ్ కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతర పరిణామాలతో 2014లో ఓడిపోయారు. దీంతో 2015లో కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన బొత్స సత్యనారాయణ తన మద్దతుదారులతో కలిసి వైఎస్సార్‌సీపీలో చేరారు. 2019 చీపురుపల్లి నియోజకవర్గం నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి క్యాబినెట్‌లో పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్‌గా కూడా ఆయన పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment