గులాబీ నేతల్లో ...అంతర్మథనం!
Published Tue, Aug 6 2013 12:07 AM | Last Updated on Fri, Sep 1 2017 9:40 PM
గులాబీ నేతలు అంతర్మథనంలో పడిపోయారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏర్పాటైన టీఆర్‌ఎస్‌లో తమ భవిష్యత్ రాజకీయ జీవితంపై బెంగ పెట్టుకున్నారు. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం, తమ పార్టీ మనుగడపై రకరకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో వీరంతా ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రమిస్తే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని గతంలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన ప్రకటన ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. పదమూడేళ్లుగా పార్టీలో వివిధ స్థాయిల్లో పనిచేసిన వారు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా నియోజకవ ర్గాల నుంచి బరిలోకి దిగాలని ఆశ పెట్టుకున్నారు. గతంలో ఓసారి కాంగ్రెస్‌తో, ఆ తర్వాత టీడీపీతో ఎన్నికల పొత్తు కారణంగా చాలా నియోజకవర్గాల్లో పోటీ చేయలేక పోయారు. వారంతా ఈసారి తమకు కచ్చితంగా అవకాశం వస్తుందని ఆశపడ్డారు.
కానీ, టీఆర్‌ఎస్‌ను విలీనం చేస్తే ఎలా అన్న ప్రశ్న వీరికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఒకవేళ విలీనం చేయకున్నా, మళ్లీ కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తుకైనా వెళ్లే అవకాశం ఉంటుందని పార్టీ శ్రేణుల్లోనే చర్చ జరుగుతోంది. ఒకవేళ విలీనం చేయకుండా, పొత్తుకు వెళ్లే పక్షంలో అధికార కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానాలను వదులుకోదని, ఆ లెక్కనా తాము తక్కువ సీట్లకే పరిమితం కావాల్సి ఉంటుందన్న అభిప్రాయం కొందరు నాయకులు వ్యక్తం చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఆలేరు, సూర్యాపేట, హుజూర్‌నగర్, నాగార్జునసాగర్, దేవరకొండ, నల్లగొండ, నకిరేకల్ నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇక, భువనగిరి, తుంగతుర్తి, కోదాడ, మిర్యాలగూడ, మునుగోడు నియోజకవర్గాలే మిగిలాయి. నల్లగొండ, భువనగిరి లోక్‌సభ స్థానాలూ కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి.
ఈసారి మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలన్న ముందస్తు వ్యూహంతో టీఆర్‌ఎస్ ఆయా నియోజకవర్గాల్లో చాలా ముందుగానే ఇన్‌చార్జ్‌లను నియమించింది. ఆలేరులో గొంగడి సునీత, సూర్యాపేటలో జగదీశ్వర్‌రెడ్డి, నకిరేకల్‌లో వేముల వీరేశం, మిర్యాలగూడ అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి ఆ నియోజకవర్గాల్లో ఇన్‌చార్జ్ లుగా ఉన్నారు. ఆలేరు, సూర్యాపేట, నకిరేకల్ కా ంగ్రెస్ సిట్టింగ్ స్థానాలు. ఇక, మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి ఈసారి ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పోటీ చేయాలని ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారు. మునుగోడుపై రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్‌రెడ్డి తన కూతురును బరిలోకి దింపేందుకు పట్టుదలగా ఉన్నారు. నల్లగొండలో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కాదని టీఆర్‌ఎస్ అవకాశం రావడం దుర్లభం.
సాగర్, దేవరకొండల్లోనూ ఇదే పరిస్థితి. నల్లగొండ లోక్‌సభ స్థానంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డికి అవకాశం ఇస్తున్నట్లు పార్టీ ఇప్పటికే ప్రకటించింది. నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇన్‌చార్జ్‌గా చకిలం అనిల్‌కుమార్ ఉన్నా, పోటీ మాత్రం దుబ్బాక నర్సింహారెడ్డి చేస్తారని పార్టీలో ప్రచా రం జరిగింది. కానీ, తాజా పరిస్థితుల దృష్ట్యా అంతా అయోమయంగా తయారైందని గులాబీ నేతలు అంటున్నారు. టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేసి నా, ఎన్నికల పొత్తు పెట్టుకున్నా, జిల్లా టీఆర్‌ఎస్‌కు తక్కువ స్థానాల్లోనే అవకాశం ఉంటుం దన్న అంచనాకు ఆ పార్టీ నాయకులు వచ్చారు. పార్టీ స్వతంత్రంగానే ఎన్నికల బరిలోకి దిగితే మినహా తమకు అవకాశం రావడం కష్టమన్న అంతిమ అభిప్రాయానికి వచ్చామని ఓ నాయకుడు ‘సాక్షిప్రతినిధి’తో వ్యాఖ్యానించారు. ఇక మరో నాయకుడు ఏదేమైనా.. ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేయాల్సిందేన్న నిర్ణయానికి వచ్చినట్లు కూడా చెబుతున్నారు. మొత్తానికి గులాబీ శ్రేణుల్లో పూర్తిస్థాయి నిశ్శబ్ధం ఆవరించింది. తెలంగాణ ప్రకటన వెలువడిన తర్వాత కూడా ఆ పార్టీవైపు నుంచి కనీసం సంబరాలు జరగక పోవడం ప్రస్తావనార్హం.
Advertisement
Advertisement