
పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు వీగిపోదు: కృపారాణి
విశాఖపట్నం, న్యూస్‌లైన్: చిన్నరాష్ట్రాలకు కమలనాథులు అనుకూలం కావడంతో పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు వీగిపోదని కేంద్రమంత్రి కిల్లి కృపారాణి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ అతిథిగృహంలో బుధవారం ఉదయం తనను కలసిన విలేకరులతో ఆమె మాట్లాడారు. కేంద్రంలో, రాష్ట్రంలో ప్రతిపక్షాలైన బీజేపీ, టీడీపీలు రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని సీడబ్ల్యూసీకి, అఖిలపక్షపెద్దలకు లేఖలిచ్చారని ఈ పరిస్థితుల్లో తామెలా కాదంటామని మంత్రి ప్రశ్నించారు.
చంద్రబాబు తానిచ్చిన లేఖను వెనక్కి తీసుకుని సమైక్యాంధ్రకోసం పోరాడితే తాము తప్పకుండా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రధానిని నిలదీసేవారమన్నారు. రాహుల్‌ను ప్రధానిని చేయడానికే సోనియా రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారన్న విపక్షాల ఆరోపణలను తోసిపుచ్చారు. రెండుసార్లు ప్రధాని అవకాశం వచ్చినా పదవీ బాధ్యతలు చేపట్టని సోనియా తన కొడుకును ప్రధానిని చేయడానికి కుళ్లు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్నారు.
రాష్ట్రానికి ఓ ఐటీ ప్రాజెక్టు ఉండాలన్న ఉద్దేశంతోనే హైదరాబాద్‌కు 2.20 లక్షల కోట్లతో ఐటీ ప్రాజెక్టు మంజూరు చేశామన్నారు. రాష్ట్ర విభజన అనివార్యమైతే ఇలాంటిప్రాజెక్టును విశాఖకు కేటాయించాలని ప్రధానిని కోరినట్టు ఆమె చెప్పారు. తలసరి ఆదాయం తక్కువగా ఉన్న విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు పరిశ్రమలు కేటాయించాలని పీఎంను కోరానన్నారు. ఈనెల 24న విశాఖ కేంద్రంగా జరగనున్న అంతర్జాతీయ క్రికెట్‌మ్యాచ్‌ను అడ్డుకుంటామనడం మంచి పద్ధతి కాదని ఆమె హితవు పలికారు.