
సోనియా ఇవ్వలేదు.. కేసీఆర్ తేలేదు: హరగోపాల్
తెలంగాణ రాష్ట్రాన్ని యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ఇవ్వలేదు.. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తీసుకురాలేదని సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జి. హరగోపాల్ అన్నారు.
హన్మకొండ, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రాన్ని యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ఇవ్వలేదు.. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తీసుకురాలేదని సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జి. హరగోపాల్ అన్నారు. స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు అన్నివర్గాల ప్రజలు చేసిన పోరాటాలతోనే కేంద్రం తెలంగాణను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.
సొసైటీ ఫర్ చేంజ్ ఇన్ ఎడ్యుకేషన్(ఎస్‌సీఐఈ)ఫోరం ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా హన్మకొండలో ఆదివారం ‘విద్యానాణ్యత- అపోహలు, తెలంగాణ రాష్ట్రం -విద్యాస్వరూపం’ అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం నాయకులతో రాలేదని.. ప్రజల పోరాటాలు, విద్యార్థుల ఆత్మబలిదానాలతోనే ఏర్పడిందని తెలిపారు. కొత్త రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని తపరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన జాయింట్ యాక్షన్ కమిటీని(జాక్)ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ‘విద్యావిధానం లోటుపాట్లు -ఉద్యమాలు’అంశంపై డి.రమేష్‌పట్నాయక్ మాట్లాడారు.