నంగునూరు, న్యూస్‌లైన్: ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందేలా చూసేందుకు ఏర్పాటు చేసిన రచ్చబండ రాజకీయ నాయకుల ఆధిపత్యానికి వేదికైంది. వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై సమైక్యవాది సీఎం కిరణ్ బొమ్మ ఉండకూడదంటూ కొందరు చించేశారు. దీంతో ప్రారంభమైన గొడవ దూషణలు, నినాదాలతో హోరెత్తింది. ఓ దశలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నేతలు బాహాబాహీకి దిగే వరకూ వెళ్లింది. అయితే సభలో ఉన్న మహిళలు నేతలపై ఎదురు తిరగడంతో పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. దీంతో అధికారులు సంక్షేమ పథకాలపై అవగాహన, ప్రసంగాలు లేకుండానే దరఖాస్తుల స్వీకరణతో కార్యక్రమాన్ని ముగించారు.
మూడవ విడత రచ్చబండ కార్యక్రమం బుధవారం మండల కేంద్రం నంగునూరులో నిర్వహించారు. కార్యక్రమానికి సిద్దిపేట ఏఎంసీ చైర్మన్ గూడూరి శ్రీనివాస్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, నియోజకవర్గ ఇన్‌చార్జి, జేడీలక్ష్మారెడ్డి, మండల స్పెషలాఫీసర్ వెంకటేశ్వర్లు హాజరయ్యారు. సభ ప్రారంభం కాగానే సమైక్యవాదం వినిపిస్తున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి బొమ్మను తొలగించాలని టీఆర్‌ఎస్ నాయకులు నినాదాలు చేస్తూ వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చింపివేశారు. దీంతో అక్కడే ఉన్న ఏఎంసీ చైర్మన్ గూడూరి శ్రీనివాస్ ఆందోళనకారులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి సమైక్యవాదే అయినప్పటికీ ఆయన ఫొటోను చింపడం సరికాదన్నారు. దీంతో టీఆర్‌ఎస్ నాయకులు తెలంగాణ నినాదాలు చేస్తూ సభ వద్దకు దూసుకు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దేవులపల్లి యాదగిరి కలుగజేసుకుంటూ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి బొమ్మ ఉన్న ఫ్లెక్సీని మళ్లీ వేదికపై ఉంచేంతవరకూ రచ్చబండ జరగబోనివ్వమన్నారు. దీంతో టీఆర్‌ఎస్ నాయకులు మరోసారి వేదిక వద్దకు దూసుకువచ్చేందుకు ప్రయత్నించగా, కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. ఓ దశలో ఇరువర్గాలు బాహాబాహీకి దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో ‘‘కిరణ్‌కుమార్‌రెడ్డి జిందాబాద్’’ అంటూ కాంగ్రెస్ నేతలు నినాదాలు చేయగా, ‘‘హరీష్‌రావు జిందాబాద్...డిప్యూటీ సీఎం జిందాబాద్ ’’ అంటూ టీఆర్‌ఎస్ నేతలు నినాదాలు ఇచ్చారు. దీంతో పోలీసులు ఇరువర్గాల వారిని శాంతిపజేసేందుకు ఇబ్బందులు పడ్డారు.
తిరుగబడ్డ మహిళలు
ఎంతకూ గొడవ సద్దుమనగక పోవడంతో సహనం కోల్పోయిన మహిళలు నేతలను, అధికారులను దూషిస్తూ వేదికపైకి దూసుకురావడంతో టెంటు కుప్పకూలింది. నాయకులందరూ వెళ్లిపోతే మేమే రచ్చబండను జరుపుకుంటామని ప్రజలు నినాదాలు చేయడంతో సర్పంచులు, అధికారులు సభ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. మళ్లీ కాంగ్రెస్ నేతలు సీఎం ఫ్లెక్సీ పెట్టాలంటూ గొడవకు దిగగా, ఏఎంసీ చైర్మన్ గూడూరి శ్రీనివాస్ కలుగజేసుకుని సభ సజావుగా జరిగేలా చూడాలని వారిని కోరారు. అయినప్పటికీ వినిపించుకోని సర్పంచ్ యాదగిరి సీఎం ఫ్లెక్సీ పెట్టాల్సిందేనని పట్టుబట్టగా, వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో వెంటనే జేడీ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సభను ముగిస్తున్నామనీ, ప్రజలు దరఖాస్తులను కౌంటర్ల వద్ద ఇవ్వాలని, పథకాలు మంజూరైన లభ్ధిదారులు ధ్రువీకరణ పత్రాలను తీసుకు వెళ్లాలని చెప్పి సభను ముగించారు.