తెలుగు కాంగ్రెస్ | Telugu Congress | Sakshi
Sakshi News home page

తెలుగు కాంగ్రెస్

Mar 4 2014 3:11 AM | Updated on Sep 2 2017 4:19 AM

తెలుగు కాంగ్రెస్

తెలుగు కాంగ్రెస్

సొంత జిల్లాలో చంద్రబాబునాయుడు తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీ నాయకులకు మింగు డు పడటం లేదు.

సాక్షి, తిరుపతి: సొంత జిల్లాలో చంద్రబాబునాయుడు తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీ నాయకులకు మింగు డు పడటం లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీ వైపు చూస్తున్న నాయకులకు చంద్రబాబు ఇస్తున్న అనుకూల సంకేతాలు వారిని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. పదేళ్లుగా కాంగ్రెస్‌లో అధికారం అనుభవించి, కార్యకర్తలపై కేసులు బనాయించిన వా రికి ఇప్పుడు టీడీపీలో పెద్దపీట వేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు జీర్ణించుకోలేకపోతున్నారు.

జిల్లాలో సగం అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ నుంచి వచ్చే వారికి కేటాయించే పరిస్థితులు ఉన్నాయని టీడీపీ ముఖ్యనేత ఒకరు అసహనంతో చెప్పడం ఆ పార్టీ నాయకుల్లోని ఆందోళనకు అద్దం పడుతోంది. తాజా మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, ప్రస్తుత శాసనసభ్యులు గుమ్మడి కుతూహలమ్మ, షాజహాన్‌బాషా, డాక్టర్ రవి, మాజీ ఎమ్మెల్యేలు ఎస్సీవీ నాయుడు, జీవీ శ్రీనాధరెడ్డి, కిందటి ఎన్నికల్లో తంబళ్లపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన శంకరయాదవ్ తదితరులు టీడీపీలోకి వెళ్లేందుకు కర్చీఫ్‌లు వేసి ఉన్నారు.

అందరికీ దాదాపుగా అనుకూల సంకేతాలు ఇచ్చినప్పటికీ ఒకేసారి చేర్చుకుంటే విమర్శలు తప్పవన్న భావనతో ఒక్కొక్కరిని ఒక్కో సందర్భంలో చేర్చుకునేందుకు బాబు రంగం సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే తంబళ్లపల్లి నియోజకవర్గంలో శంకరయాదవ్ ఒకటిరెండు రోజుల్లో నియోజకవర్గంలో పెద్ద బహిరంగ సభ పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  కిందటి ఎన్నికల్లో ఓడించిన అభ్యర్థినే ఇప్పుడు నెత్తిన పెట్టుకోవాల్సి వస్తోందని కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

చంద్రగిరి నియోజకవర్గంలో ఇంతకంటే ఎక్కువ ఆందోళన టీడీపీ కార్యకర్తల్లో ఉంది. దశాబ్దా లుగా వ్యతిరేకించిన గల్లా కుటుంబానికి సాదర స్వాగతం పలికే పరిస్థితులు కల్పిస్తున్నారనే భావన వ్యక్తం అవుతోంది. దీనికి తోడు గల్లా వర్గంగా ముద్రపడిన వారు బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాల్సి వస్తోందని ఆ నియోజకవర్గ టికెట్టు ఆశిస్తున్న ఒక నాయకుడు కుండబద్దలు కొట్టినట్టు అభిప్రాయం వ్యక్తం చేశారు.

చంద్రగిరి నుంచి అరుణకుమారికి టికెట్టు ఇస్తేనే తాము టీడీపీకి అనుకూలంగా పనిచేస్తామని అంతర్గతంగా చంద్రబాబుకు హెచ్చరికలు చేస్తున్నారు. మదనపల్లె కాంగ్రెస్ శాసనసభ్యులు షాజహాన్‌బాషా కూడా చంద్రబాబుకు షరతులతో కూడిన సందేశం పంపారు. చంద్రబాబు మాత్రం పార్టీ వీక్‌గా ఉన్న పీలేరులో పోటీ చేయాలని సూచించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇదే నియోజకవర్గం నుంచి పీలేరు మాజీ ఎమ్మెల్యే, టీటీడీ పాలకమండలి సభ్యులు జీవీ శ్రీనాథరెడ్డిని కూడా టీడీపీలో  చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
 
గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కుతూహలమ్మకు దాదాపుగా చంద్రబాబు నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. దీంతో ఆమె మండలాల వారిగా తన అనుచరవర్గాన్ని టీడీపీ వైపు మళ్లించేందుకు మానసికంగా సిద్ధం చేస్తున్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ రవి టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈయన పార్టీ ప్రవేశానికి చంద్రబాబు అంగీకరించినప్పటికీ టికెట్టు విషయంలో ఇంకా హామీ ఇవ్వలేదని అంటున్నారు.

శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు కూడా టీడీపీ టికెట్టు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కనీసం నెల్లూరు జిల్లా వెంకటగిరి టికెట్టు ఇచ్చినా జంప్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. కాంగ్రెస్ నుంచి వచ్చే అందరికీ చంద్రబాబు ఇస్తున్న సంకేతాలు చూస్తుంటే టీడీపీని పిల్ల కాంగ్రెస్‌గా మారుస్తున్నారనే అపవాదును ఏదుర్కోక తప్పదన్న భావన ఆ పార్టీ కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు.
 
గాలికి తప్పని తిప్పలు
 
పార్టీ సీనియర్ నాయకులు గాలి ముద్దుకృష్ణమనాయుడుకు సైతం ఇబ్బందులు తప్పలేదు. నగరి నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి చెంగారెడ్డి కుమార్తె ఇందిరకు టికెట్టు ఇచ్చేందుకు బాబు అంగీకరించినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో బెంబేలెత్తిన టీడీపీ కార్యకర్తలు ముద్దుకృష్ణమనాయుడును ఆరా తీయడం ప్రారంభించారు. దీంతో ఆయన ఒకదశలో విసుగెత్తిపోయినట్టు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement