జిల్లాలో తెలుగుదేశం పార్టీని ఒక్కొక్కరుగా వీడుతుం డటంతో ఖాళీ అవుతోంది.
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: జిల్లాలో తెలుగుదేశం పార్టీని ఒక్కొక్కరుగా వీడుతుం డటంతో ఖాళీ అవుతోంది. ఏళ్ల తరబడి పార్టీ పల్లకి మోసిన నేతలు గుడ్‌బై చెబుతుండటంతో పార్టీ శ్రేణుల్లో కలవరం మొదలైంది. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు జోగు రామన్న, చారి.. మాజీ మంత్రి బోడ జనార్దన్.. నిర్మల్, కాగజ్‌నగర్ నియోజకవర్గ ఇన్‌చార్జీలు సత్యనారాయణగౌడ్, పాల్వాయి రాజ్యలక్ష్మి పార్టీని వీడారు. ఇటీవల సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గోనె హన్మంతరావు తెలుగుదేశం పార్టీకి రాంరాం చెప్పారు. తాజాగా పదేళ్లుగా మంచిర్యాల నియోజకవర్గంలో పార్టీకి కీలకంగా వ్యవహరిస్తున్న ప్రముఖ న్యాయవాది, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కేవీ ప్రతాప్ గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబు, జిల్లా అధ్యక్షుడు గోడం నగేశ్‌కు గురువారం ఫ్యాక్స్ ద్వారా పంపించారు. ఆ తర్వాత మంచిర్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిపై, ఎంపీ రాథోడ్ రమేశ్, జిల్లా అధ్యక్షుడు గోడం నగేశ్‌లపై విమర్శలు చేశారు. తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు ముఖేశ్ కూడా అదేబాటలో పయనిస్తున్నట్లు సమాచారం. మరికొందరు కూడా రాజీనామా బాటలో ఉండటం టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాజీనామా బాటలో మరికొందరు..
తెలుగుదేశం పార్టీకి జిల్లాలో మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. చంద్రబాబు కొందరికే ప్రాధాన్యత ఇస్తుండటంపై నిరసన వ్యక్తమవుతోంది. ఎంపీ రాథోడ్ రమేశ్, ఎమ్మెల్యే గోడం నగేశ్‌లకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వారిచ్చిన సమాచారంతోనే పార్టీ పదవులు కేటాయిస్తున్నారంటూ కేడర్ బహిరంగంగానే చర్చిస్తోంది. జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలుంటే... బోథ్, ఖానాపూర్‌లు మినహాయిస్తే అన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీ సీనియర్లు సృష్టించిన బహునాయకత్వం తలనొప్పవుతోంది. ఈ నేపథ్యంలో కొందరు నేతలకే ప్రాధాన్యత ఇస్తున్న చంద్రబాబును, ఆయన కోటరీని నమ్ముకుని టీడీపీలో కొనసాగలేమంటూ ఇప్పటికే చాలా మంది పార్టీ నుంచి తప్పుకున్నారు. మరికొందరు నేతలు పార్టీని వీడేందుకు సిద్ధమవుతుండటం చర్చనీయాంశం అవుతోంది. ఏదేమైనా జిల్లాలో టీడీపీ కోటలకు బీటలు బారుతుండగా.. నాయకులు, కార్యకర్తల ప్రతిఘటన, వలసబాట అధిష్టానాన్ని అతలాకుతలం చేస్తోంది.