
తెలుగు ప్రజలకు చంద్రబాబు నమ్మకద్రోహం
- సర్కారు వైఫల్యాలను వివరించేందుకే ఈనెల 31, ఫిబ్రవరి 1న తణుకులో జగన్ దీక్ష
- వైఎస్సార్‌సీపీ త్రిసభ్య కమిటీ నేతలు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెల్లడి
సాక్షి, విజయవాడ బ్యూరో: చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు కావస్తున్నా ఎన్నికల హామీలను అమలు చేయకుండా, ప్రజలకు నమ్మకద్రోహం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు. చంద్రబాబు హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 31, ఫిబ్రవరి 1వ తేదీ ల్లో తణుకులో తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దీక్ష చేపట్టనున్నట్టు చెప్పారు. దీక్ష విజయవంతం కోసం పార్టీ త్రిసభ్య కమిటీకి చెందిన విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సాగి ప్రసాదరాజు శనివారం గుంటూరు, కృష్ణా జిల్లా నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సాయిరెడ్డి, ఉమ్మారెడ్డి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లులో కేంద్ర ప్రభుత్వం పొందుపరచిన హామీలను సాధించుకోవడంలో బీజేపీ మిత్రపక్షంగా టీడీపీ సర్కారు ఘోరంగా విఫలమైందని చెప్పారు. సీఎంగా ఎనిమిది నెలల్లో పదిసార్లు ఢిల్లీ వెళ్లిన బాబు ఏం సాధించారని సాయిరెడ్డి ప్రశ్నించారు. పునర్విభజన సమయంలో ఏపీ బడ్జెట్‌లో రూ.16 వేల కోట్ల లోటును కేంద్రం భరించేలా ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదని గుర్తుచేశారు.
రైతులను, ప్రజలను దగా చేసి ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తానని చంద్రబాబు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ర్టంలో చేతగాని, అసమర్థ, దద్దమ్మ ప్రభుత్వం వల్ల క్షేత్రస్థాయిలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి దీక్షకు మద్దతుగా కృష్ణా, గోదావరి డెల్టాల రైతులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున కదలివస్తారని చెప్పారు. ‘చంద్రన్న సంక్రాంతి కానుక’లో ప్రభుత్వ ప్రచారం ఎక్కువైందని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి సైతం చెప్పారని గుర్తుచేశారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవిపై టీడీపీ వర్గీయుల దాడి విషయాన్ని గవర్నర్‌కు, డీజీపీకి వివరించామన్నారు. దాడుల విషయమై అసెంబ్లీ సమావేశాల్లో నిలదీస్తామని చెప్పారు.
కృష్ణా, గుంటూరు నేతలతో సమావేశం
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో డిసెంబర్ 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో జరగనున్న వైఎస్ జగన్ దీక్షను విజయవంతం చేసేలా కృష్ణా, గుంటూరు జిల్లాల పార్టీ ముఖ్యులతో త్రిసభ్య కమిటీ నేతలు సాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సాగి ప్రసాదరాజులు సమావేశమై పలు సూచనలు చేశారు. మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణలు పాల్గొన్నారు.