ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : ఈడ కాకపోతే ఆడ.. ఇక్కడ వ్యాపారులు ముందుకు రాకపోతే అక్కడ తీసుకునేవారు మత్తుమంది ఉన్నరు.. తాగేటోళ్లు కూడా మస్తుగున్నారు. తమకెందుకీ గోస.. అంటూ ఆబ్కారీ శాఖ వైన్‌షాపులను ఏకంగా జిల్లాలనే దాటిస్తోంది. పక్క జిల్లా కూడా కాదు.. అమాంతం వందలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇతర జిల్లాలకు జిల్లా నుంచి మద్యం దుకాణాలను తరలించేస్తోంది. సర్కారుకు అత్యధిక ఆదాయాన్నిచ్చే మద్యం విక్రయాల విషయంలో పలు ఎత్తుగడలకు పాల్పడుతోంది.
జిల్లాలో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఏడుసార్లు టెండర్లు పిలిచినా 62 మద్యం దుకాణాలను పొందేందుకు వ్యాపారులు ఆసక్తి చూపలేదు. దీంతో పలుచోట్ల వైన్‌షాపులకు షెట్టర్లు పడ్డాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఎక్సైజ్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన అహ్మద్ నదీం శుక్రవారం హైదరాబాద్‌లో రాష్ట్రంలోని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్లు, సూపరింటెండెంట్లతో సమావేశం నిర్వహించారు. అందులోభాగంగానే మద్యం దుకాణాల తరలింపు నిర్ణయం తీసుకున్నారు.
32 షాపులు తరలింపు..
జిల్లాలో 2013-14 ఆర్థిక సంవత్సరంలో అమ్ముడుపోని, రెన్యూవల్‌కు నోచుకోని 74 వైన్‌షాప్‌లకు ఏడుసార్లు రీటెండర్ నిర్వహించగా 13 వైన్‌షాపులకు మాత్రమే మద్యం వ్యాపారులు టెండ ర్లు దాఖలు చేశారు. 62 మద్యం దుకాణాలు పొందేందుకు వ్యాపారులు ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలో మరోసారి టెండర్లు పిలిచినా పెద్దగా దరఖాస్తులు వస్తాయన్న ఆశ ఆబ్కారీ శాఖలో కనిపించడం లేదు. దీంతో వాటిలో నుంచి 32 వైన్‌షాపులను మూడు వేర్వేరు జిల్లాలకు తరలిస్తున్నారు. నల్గొండ జిల్లాకు 14, మెదక్‌కు 10, మహబూబ్‌నగర్ 8 వైన్స్‌లను తరలించేస్తున్నారు. నిర్ణీత ఆదాయం కంటే 14 రెట్లు అధికంగా మద్యం విక్రయాలు జరిగే ప్రాంతాలను పరిగణలోకి తీసుకొని ఈ దుకాణాలను మారుస్తున్నారు. జిల్లాలో ఇలాం టివి ఆదిలాబాద్, నిర్మల్, భోరజ్ మాత్రమే ఉన్నాయి.
మిగిలిన షాపులకు నోటిఫికేషన్ జారీ..
కాగా మిగిలిన 29 షాపులకు కలెక్టర్ అహ్మద్‌బాబు శనివారం 8వ సారి నోటిఫికేషన్ జారీ చేశారు. డిసెంబర్ 6 వరకు మద్యం వ్యాపారులు ఈ షాపుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 7న ఆదిలాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఉదయం 11గంటలకు లక్కీడ్రా నిర్వహిస్తారు. టెండర్‌కు పిలిచిన 29 దుకాణాల్లో నాలుగు దుకాణాల ప్రదేశాలను మారుస్తున్నారు. మంజులాపూర్‌లోని దుకాణాన్ని ఆదిలాబాద్‌లోని వార్డు నెం.25 పంజాబ్‌చౌక్‌కు, నిర్మల్‌లోని వార్డు నెం. 19లో ఉన్న వైన్‌షాప్‌ను బస్టాండ్ ఎదురుగా ఉన్న వార్డు నెం.13కు మారుస్తున్నారు. కడెంలోని వైన్‌షాప్‌ను జైనథ్ మండలం భోరజ్‌కు, చించోలి(బి) దుకాణాన్ని తానూర్ మండల కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. ఆదిలాబాద్‌లోని పంజాబ్ చౌక్ మద్యం దుకాణం పొందేందుకు వ్యాపారులు పెద్ద ఎత్తున పోటీపడే అవకాశం ఉంది. కాగా ఈసారి కూడా పలు షాపులకు టెండర్లు రాని పక్షంలో ఆంధ్రప్రదేశ్ బివరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీబీసీఎల్) ఆధ్వర్యంలో వైన్‌షాపులను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.
తరలించినవి ఇవే..
తాళ్లపల్లి, క్యాతన్‌పల్లి, జన్నారం, మాధారంలో ని రెండేసి షాపులు, ముల్కల, నస్పూర్, అకినెపెల్లి, చాకెపల్లి, ఆదిల్‌పేట్, దుబ్బగూడ, సిర్పూర్(టి), వెంకట్రావ్‌పేట, తాండూర్, దేవాపూర్, గుడిహత్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, సిర్పూర్(యు), సోన్, పెంబి, సారంగాపూర్, జామ్, లోకేశ్వరం, వానల్‌పాడ్, నేరడిగొండలోని ఒ క్కో షాపు ఇతర జిల్లాలకు తరలాయి.
ఇక్కడ కాకుంటే.. అక్కడ తాగిస్తాం
Published Sun, Dec 1 2013 4:26 AM | Last Updated on Fri, Aug 17 2018 7:44 PM
Advertisement
Advertisement