రాజాం: ఆగూరు పంచాయతీ పరిధిలో తోటపల్లి కాలువ తవ్వకాల పనుల్లో ఆయా భూములకు చెందిన కంచరాం రైతులు వారం రోజులుగా పనులను అడ్డుకొని ఆందోళన చేపడుతున్నారు. భూముల్లో తవ్వకాలు చేపడుతున్నారే తప్ప ఆ భూములకు సంబంధించిన పరిహారం మాత్రం రైతులకు అందించడంలేదని అధికారులపై దుయ్యబడుతున్నారు.
పరిహారం అందించే వరకూ పనులు జరపనివ్వమని ఖరాఖండీగా తెలిపి పనులను అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎలాగైనా శనివారం పనులు చేపట్టాలనే ఉద్దేశంతో సంబంధిత అధికారులు ముందస్తుగానే రైతులను అడ్డుకోవడానికి పోలీస్ బందోబస్తును కోరారు. ఈ మేరకు ఎస్సై ప్రభాకర్ సిబ్బందితో సంఘటన స్థలానికి ఉదయం ఆరు గంటలకే చేరుకున్నారు. రైతులను సంయమనం పాటించాలని సూచించారు. అయినా పనులను అడ్డుకోవడంతో పాలకొండ ఆర్డీవో సాల్మన్‌రాజ్, తోటపల్లి ఈఈ రామచంద్రరావు, తహశీల్దార్ సూపరింటెండెంట్ కృష్ణారావు వచ్చి రైతులతో చర్చించారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా రైతుల ప్రతినిధి గెడ్డాపు అప్పలనాయుడు మాట్లాడుతూ కంచరాం గ్రామానికి చెందిన సుమారు 25 మంది రైతులకు ఆగూరు పరిధిలో భూములున్నాయని, పరిహారం ఇవ్వకుండా వాటిలో తోటపల్లి కాలువ పనులు చేపట్టడం దారుణమని వాపోయాడు.
దీనికి ఆర్డీఓ సాల్మన్‌రాజ్ స్పందిస్తూ ఇంతవరకూ పరిహారం ఎందుకు చెల్లించలేదో దర్యాప్తు జరిపిస్తామన్నారు. వారంలోగా పరిహారం అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. అనంతరం రైతుల ప్రతినిధి అప్పలనాయుడతో సహా అధికారులంతా రాజాంలోని నగరపంచాయతీ కార్యాలయంలో సమావేశమై దర్యాప్తు ప్రారంభించారు. భూములకు సంబంధించిన వివరాలు రైతులు ఇవ్వకపోవడంతోనే ఎన్‌ఓసీ ఇవ్వలేకపోయామని స్థానిక రెవెన్యూకార్యాలయ సూపరింటెండెంట్ కృష్ణమూర్తి తెలిపారు. నాలుగు రోజుల్లోగా రైతుల నుంచి వివరాలు సేకరించి ఎన్‌ఓసీ అందించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఉద్రిక్త వాతావరణంలో ‘తోటపల్లి’ తవ్వకాలు
Published Sun, Aug 2 2015 1:23 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement