ఏర్పాట్లు పదిలం..!
నేటి నుంచి టెన్త్ పరీక్షలు
కేంద్రాల్లో హడావుడిగా ఫర్నిచర్ ఏర్పాటు
తొలిరోజు అరగంట ఆలస్యమైనా ఓకే
62,568 మంది విద్యార్థులు.. 268 కేంద్రాలు
విశాఖపట్నం/చోడవరం : పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి మొదలవుతున్నాయి. విద్యాశాఖ మంత్రి సొంత జిల్లాలోనే పరీక్ష కేంద్రాల్లో కనీస వసతులు లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ విమర్శలు వెల్లువెత్తుతాయోనని అనుకున్నారో ఏమో ఎకాయెకిన అన్ని కేంద్రాల్లో సౌకర్యాలు మెరుగుపరిచే పనులు చేపట్టారు. మెజార్టీ కేంద్రాల్లో పూర్తిస్థాయిలో బెంచీలు, తరగతి గదుల్లో ఫ్యాన్లు కూడా లేవు. కొన్నింట విద్యుత్ సదుపాయం లేని దుస్థితి. వీటన్నింటినీ అధిగమించేందుకు ఆదరాబాదరా పడుతున్నారు. సమీపంలో ఉన్న ప్రైవేటు పాఠశాలల నుంచి సీలింగ్ ఫ్యాన్లు, బెంచీలు తెచ్చి ఏర్పాటు చేస్తున్నారు. మునుపటికి భిన్నంగా ఈ ఏడాది విద్యార్థులు నేలపై కూర్చుని పరీక్షలు రాసే బాధలను తప్పించాలని హడావుడి పడుతున్నారు. అన్ని కేంద్రాలకు అధికారులు ఫర్నిచర్ సమకూరుస్తున్నారు. మినరల్ వాటర్ , వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నారు.
ఉదయం 9.30 నుంచి మధ్నాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. మొత్తం 62,568 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో 5,813 మంది ప్రైవేటు విద్యార్థులు. పరీక్షలకు 268 సెంటర్లను సిద్ధం చేశారు. సోమవా రం నుంచి ఏప్రిల్ 7 వరకు జరిగే ఈ పరీక్షలకు ఇప్పటికే విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. గత అనుభవాల దృష్ట్యా జిల్లాలో 12 సమస్యాత్మక పరీక్ష కేంద్రాలను గుర్తించారు. కాపీయింగ్ అవకాశం లేకుండా సీసీ కెమెరాలు, వెబ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. 13 ఫ్లైయింగ్ స్క్వాడ్లు, ఐదు సిటింగ్ స్కాడ్లు, ఏజెన్సీలో రెండు స్ట్రయికింగ్ ఫోర్సులను నియమించారు. మరోవైపు అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను విధించారు. పరీక్ష కేంద్రాలకు సమీపంలో జెరాక్స్ సెంటర్ల మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు.మరోవైపు ఆర్టీసీ కూడా దూర ప్రాంతంలో పరీక్షలు రాయడానికి వెళ్లే వారికోసం బస్సులను ఏర్పాటు చేసింది. తొలిరోజు మాత్రం పరీక్ష సమయం మించిపోయాక అరగంట వరకు విద్యార్థులను అనుమతిస్తారు. పరీక్ష సమయానికి ముప్పావు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
రూట్ పాస్‌లుంటేనే ఫ్రీ!
సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులను హాల్‌టిక్కెట్లతో పాటు రూట్‌పాస్‌లుంటేనే ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా అనుమతిస్తామని ఆర్టీసీ విశాఖ రీజనల్ మేనేజర్ జి.సుధేష్‌కుమార్ స్పష్టం చేశారు. హాల్‌టిక్కెట్లున్న అందరినీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతి లేదన్నారు. నగరం లేదా జిల్లాలో రూట్ పాస్ తీసుకుంటే ఏ రూట్‌లోనైనా ప్రయాణించేందుకు వీలు కల్పిస్తామన్నారు. రూట్ పాస్‌తో పాటు హాల్‌టిక్కెట్టును చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణించాలనుకున్న విద్యార్థులు రూ.10 కాంబీ టిక్కెట్ తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ సూచనలను గమనించాలని ఆర్‌ఎం ఒక ప్రకటనలో కోరారు. మరోవైపు విశాఖలో జిల్లాలోని పదో తరగతి పరీక్ష కేంద్రాలకు 15 బస్సులను నడుపుతున్నారు. -ఆర్టీసీ ఆర్‌ఎం స్పష్టీకరణ
కేంద్రాల వద్ద 144 సెక్షన్
టెన్త్ పరీక్ష కేంద్రాల వద్ద ఉదయం 8 నుంచి మధ్నాహ్నం 2 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుంది. వాటికి 200 మీటర్ల దూరంలో నలుగురు ఐదుగురికి మించి గుమిగూడి ఉండకూడదు. సమీపంలో ఉన్న జెరాక్స్ షాపుల మూసివేతకు ఆదేశించాం. విద్యార్థులు ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా సంబంధిత పోలీసు అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించాం. పరీక్ష కేంద్రాల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రక్షక్, బ్లూకోల్ట్స్, పెట్రోలింగ్ వాహనాలు గస్తీ తిరిగే ఏర్పాట్లు చేశాం.
-అమిత్‌గార్గ్, నగర పోలీస్ కమిషనర్.