సాక్షి, విజయవాడ : విజయదశమి రోజున కృష్ణానదిలో తెప్పోత్సవం కన్నుల పండుగగా జరిగింది. విద్యుత్ దీపాలతో అలంకరించిన హంస వాహనంలో ఆదిదంపతులు దుర్గామల్లేశ్వరస్వామివార్లు కృష్ణా నదిలో విహరించారు. ఈ వాహన సేవలో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం దంపతులు, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దంపతులు, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ దంపతులు, కలెక్టర్ మాధవి లత, దుర్గ గుడి ఈవో సురేశ్‌బాబు పాల్గొన్నారు. దాదాపు గంటన్నరపాటు తెప్పోత్సవం వైభవంగా సాగింది. ఈ సుందర దృశ్యాన్ని చూసేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. ప్రకాశం బ్యారేజ్, పున్నమి ఘాట్, భవాని ద్వీపం, పవిత్ర సంగమం వద్ద నుంచి భక్తులు తెప్పోత్సవాన్ని వీక్షించారు. అంతకుముందు దుర్గ గుడి అధికారులు.. స్వామివార్ల ఉత్సవ మూర్తులను ఇంద్రకీలాద్రి నుంచి మేళ తాళాలు, కోలాట ప్రదర్శనల నడుమ ఊరేగింపుగా దుర్గా ఘాట్‌కు తీసుకువచ్చారు.
ముగిసిన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు..
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. మంగళవారం మధ్యాహ్నం అర్చకులు సంప్రదాయ బద్ధంగా పూర్ణహుతిని నిర్వహించి దసరా ఉత్సవాలను ముగించారు. పూర్ణాహుతిలో ఆలయ ఈవో సురేశ్‌బాబు, ప్రధాన అర్చకుడు శివప్రసాద్, ఇతర అర్చకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment