'విలీనం చేయనన్న కేసీఆర్కు ధన్యవాదాలు'
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ విలీనం లేదన్నందుకు కేసీఆర్కు ధన్యవాదాలు చెబుతున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ అన్నారు. విలీనం లేదని కేసీఆర్ తేల్చి చెప్పటంతో భవిష్యత్ కార్యచరణపై తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు మంగళవారం జానారెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం షబ్బీర్ అలీ మాట్లాడుతూ తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ పార్టీని సోనియా గాంధీ కాళ్లు దగ్గర పెడతానన్న కేసీఆర్ ఇప్పుడు పిట్టల దొరలా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ఇవ్వటానికి కాంగ్రెస్, సోనియా ఎన్ని కష్టాలు పడ్డారో అందరికీ తెలుసునన్నారు.
గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎన్ని సీట్లు గెలుచుకుందో అందరికీ తెలుసునన్నారు. పార్లమెంట్లో తెలంగాణ గురించి కేసీఆర్ ఒక్కమాట అయినా మాట్లాడారా అని షబ్బీర్ అలీ సూటిగా ప్రశ్నించారు. అంత దూరం నుంచే అమ్మా అంటూ దండాలు పెట్టుకుంటూ కేసీఆర్ కుటుంబం సోనియా గాంధీ వద్దకు ఎందుకు వెళ్లారని ఆయన అన్నారు. తెలంగాణ ఇచ్చినందుకు తాము ప్రభుత్వాన్ని కోల్పోయామని షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. రేపోమాపో తెలంగాణ పీసీసీ రానున్నదని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో 119 స్థానాలు గెలుచుకుంటామని షబ్బీర్ అలీ ధీమా వ్యక్తం చేశారు.