
నిర్ణయానికి ముందు సిఎం ఏంచేశారు?: మైసూరా
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకునే ముందు మీరేం చేశారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు మైసూరా రెడ్డి ప్రశ్నించారు. సీఎం వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తన నివాసం నుంచి సాక్షిటివితో మాట్లాడారు. నీటి సమస్య భయాందోళన కలిగిస్తుందని చెప్పారు. భౌగోళిక, జల సమస్యలు ఉన్నాయని ముఖ్యమంత్రి కూడా అంగీకరించారు. పార్టీ నిర్ణయం తీసుకునే సమయంలో ఎందుకు మాట్లడలేదు? అని అడిగారు.
సీఎం ఇతర పార్టీలు దొంగ నాటకాలు ఆడుతున్నారని అంటున్నారు. కాంగ్రెస్ ఏం నాటకాలు ఆడుతోందో చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ పది తలల రావణాసురుడు లాంటిది, ఒక్కో తల ఒక్కో మాట మాట్లాడుతుందని చెప్పారు. రాష్ట్ర విభజనకు చాలా చిక్కు సమస్యలు ఉన్నాయి. ఆ విషయాలను కోర్ కమిటీలో ఎందుకు చర్చించలేదని ఆయన సిఎంను ప్రశ్నించారు. రాష్ట్రానికి చెందిన అందరితో మాట్లాడాలని తాము ముందు నుంచి చెబుతున్నామన్నారు. ఎప్పుడో ఇచ్చిన లేఖలను ఇప్పుడు రాజకీయం చేస్తారా? అని ప్రశ్నించారు.
ఆంటోనీ కమిటీలో మంత్రులు ఉన్నప్పటికీ ఆ కమిటీని కాంగ్రెస్ పార్టీ కమిటీగానే పరిగణిస్తారన్నారు. అధిష్టానం చెప్పిన ప్రకారమే ఆ కమిటీ నివేదిక ఇస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.