సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై కాంగ్రెస్ అధిష్టానం తీసుకొనే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షునితో సహా రాష్ట్రంలోని రెండు ప్రాంతాలకు చెందిన కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులంతా అంగీకరించారని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ స్పష్టంచేశారు. మంగళవారం రాత్రి ఇక్కడ ఆంటోనీ కమిటీతో తెలంగాణ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యుల సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు.
గత రెండేళ్లుగా సాగించిన విస్తృతస్థాయి సంప్రదింపులు, అన్ని రాజకీయ పార్టీల అంగీకారం తర్వాతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించాలన్న నిర్ణయం తీసుకుందని పునరుద్ఘాటించారు. అయితే, తొలుత ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థించిన టీడీపీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు మాటపై నిలబడకుండా వెనక్కు తగ్గుతున్నాయని ఆయన ఆరోపించారు. తమను సంప్రదించకుండా కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా, హడావుడిగా నిర్ణయం తీసుకొన్నదని బీజేపీ సీనియర్ నేత అద్వానీ వ్యాఖ్యానించినట్లు మీడియాలో చూశానన్న దిగ్విజయ్... ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ బీజేపీ రాసిన లేఖను అద్వానీ ఎందుకు పరిగణనలోకి తీసుకోరని ప్రశ్నించారు.
విభజన నిర్ణయాన్ని సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకిస్తుండడం... తాను గతంలో చేసిన సూచనలను పట్టించుకోకుండా, తమను సంప్రదించకుండానే అధిష్టానం నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ విమర్శించడాన్ని ప్రస్తావించగా... రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ నేతలూ అధిష్టానం నిర్ణయానికి బద్ధులమై ఉంటామని వాగ్దానం చేశారని గుర్తు చేశారు. ఆంటోనీ కమిటీతో గురువారం కొన్ని రాజకీయేతర సంఘాల ప్రతినిధులు, ఇతరులు సమావేశం కావాల్సి ఉన్నప్పటికీ శ్రీకృష్ణ జన్మాష్టమి కావడంతో వాయిదా పడినట్లు చెప్పారు. వచ్చే నెల మూడోతేదీన తిరిగి సమావేశం కానున్న కమిటీ ఆ రోజున రావాల్సిందిగా వారిని ఆహ్వానించిందని ఆయన తెలిపారు.
అందరూ అంగీకరించాకే విభజన నిర్ణయం
Published Wed, Aug 28 2013 2:24 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM
Advertisement
Advertisement