సీమాంధ్రలో ఆందోళనలు ఆపండి.. చర్చలకు సిద్ధం: దిగ్విజయ్ సింగ్
సీమాంధ్రలో ఆందోళనలు ఆపాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ విజ్క్షప్తి చేశారు. ఆంటోని కమటితో సీమాంధ్ర నేతలు సమావేశం అనంతరం మీడియాతో దిగ్విజయ్ మాట్లాడుతూ...ఆందోళనల వల్ల పిల్లలు, బ్యాంకులు, స్కూళ్లు మూతపడ్డాయని, సాధారణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయన అన్నారు. సీమాంధ్ర నాయకులు, ప్రజలు ఆంటోనీ కమిటీ ముందుకు వచ్చి తమ వాదనలు వినిపించాలని, తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నారు. బిల్లులో కాని, తీర్మానంలో కాని ఏముండాలో చెప్పాలని దిగ్విజయ్ చెప్పారు.
'సీమాంధ్రలో ఉద్యమాలకు స్వస్తి చెప్పాలన్నారు. చంచల్ గూడ జైల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్ష గురించి మాట్లాడటానికి నిరాకరించారు. జగన్ దీక్ష గురించి టీవీల్లో చూశాను గానీ, దాని గురించి హోం మంత్రిని అడగండి.. నన్ను కాదు' అని వ్యాఖ్యానించారు.
'రాష్టంలోని పరిస్థితులపై సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడతా. అందరూ కలిసి పనిచేయాలి అని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలాంటి గొడవలు జరగకూడదు. టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టకూడదు. ప్రశాంతంగా ఉండాలి' అని దిగ్విజయ్ అన్నారు.