సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ రాష్ట్ర సమితి తమ పార్టీలో విలీనమయ్యే అవకాశాలపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ ప్రత్యేకంగా ఆరా తీశారు. రాష్ట్ర పర్యటనలో ఉన్న దిగ్విజయ్.. రెండు రోజులుగా తనను కలిసిన తెలంగాణ ప్రాంత మంత్రులు, పార్టీ నాయకుల వద్ద ఈ విషయం ప్రస్తావనకు తెచ్చారు.
పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇంట్లో శుక్రవారం జరిగిన విందు భేటీలో, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలతో ఉమ్మడిగా జరిగిన భేటీలో ఈ అంశంపై చర్చ జరిగింది. గతంలో అన్నమాటకు కట్టుబడి విభజన ప్రక్రియ పూర్తయిన తరువాత టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే అవకాశాలు ఎంత వరకు ఉన్నాయని దిగ్విజయ్ అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించి ఏమైనా చర్చ జరగుతుందా అన్నదానిపై ఆరా తీశారు. తెలంగాణ ప్రాంతంలో గతంలో పార్టీ పరిస్థితి ఏమిటి? విభజన నిర్ణయం తరువాత పార్టీ పరిస్థితి ఏమైనా మెరుగుపడిందా? అని అడిగి తెలుసుకున్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల పరిస్థితి గురించి సైతం వాకబు చేశారు. దిగ్విజయ్‌ను విడి విడిగా కలిసిన తెలంగాణ ప్రాంత మంత్రులు, నేతలు ఎక్కువ మంది కేసీఆర్ పార్టీని తప్పక విలీనం చేస్తారని పేర్కొన్నట్లు సమాచారం. అయితే.. కిరణ్, దామోదర, బొత్సలతో జరిగిన భేటీలో మాత్రం విలీనం అవకాశాలు తక్కువేనని వారు అభిప్రాయపడినట్లు తెలిసింది.
దిగ్విజయ్‌ను కలిసిన ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు
దిగ్విజయ్‌సింగ్‌ను తెలంగాణ విద్యార్థి, ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు శుక్రవారం గాంధీభవన్‌లో కలిశారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు కృషిచేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపి పార్లమెంట్‌లో బిల్లును త్వరగా ప్రవేశపెట్టాని విద్యార్థి నాయకులు ఈ సందర్భంగా దిగ్విజయ్‌ను కోరారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తే సహించేది లేదని టీఎస్ జాక్ నాయకులు పిడమర్తి రవి, పున్న కైలాష్‌నేత హెచ్చరించారు.
టీఆర్‌ఎస్ విలీనం మాటేమిటి?: దిగ్విజయ్ ఆరా
Published Sat, Dec 14 2013 1:08 AM | Last Updated on Tue, Aug 14 2018 3:55 PM
Advertisement