సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర శాసనసభ తీర్మానం కోరకుండా విభజనపై ప్రభుత్వం ముందుకెళ్లడంపై సీమాంధ్ర ప్రజా ప్రతి నిధులు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ను గట్టిగా నిలదీశారు. శాసనసభ్యుల అభిప్రాయాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా ముందుకు వెళితే ప్రజాక్షేత్రంలో పార్టీకి పరాజయం తప్పదని వారు హెచ్చరించారు. అసెంబ్లీకి తీర్మానం పంపే విషయమై పార్టీ ఒక రకమైన ప్రకటన, కేంద్ర హోంశాఖ మరో విధమైన ప్రకటన చేస్తోందని, పొంతన కుదరని ప్రకటనలతో సీమాంధ్ర నేతల్లో అయోమయం నెలకొందని వివరించారు. అసెంబ్లీకి పంపించేది తీర్మానమా? లేక బిల్లా? అనే విషయమై స్పష్టత ఇవ్వాలని కోరారు. అయితే ఈ విషయంలో విభజన బిల్లు అసెంబ్లీకి పంపుతామని చెప్పిన దిగ్విజయ్.. తీర్మానం పంపే విషయంలో మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని తెలుస్తోంది.
రాష్ట్రపతితో భేటీ అనంతరం గురువారం రాత్రి సీమాంధ్ర ప్రజాప్రతినిధులు దిగ్విజయ్‌ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. అరగంటకుపైగా సమావేశమై రాష్ట్ర పరిస్థితులను వివరించారు. విభజన విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, పార్టీ ప్రతినిధులను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారని వివరించారు. ప్రజాభీష్టం మేరకు పదవులు వదులుకునేందుకూ అనేకమంది నేతలు సిద్ధంగా ఉన్నారంటూ పరోక్షంగా రాజీనామాల అంశాల్ని ప్రస్తావించారు. కాంగ్రెస్‌ను దోషిగా చూస్తు న్న ప్రస్తుత తరుణంలో కింది స్థాయి నాయకత్వం అంతా పార్టీలు మారే ఆలోచనలు చేస్తోందన్నారు.
పార్టీనే నమ్ముకున్న తాము ఎక్కడికెళ్లాలో మీరే చెప్పాలన్నారు. విభజనపై కేంద్రం వెనక్కి తగ్గకుంటే సీమాంధ్రలో పార్టీ మునగడం ఖాయమని వారు హెచ్చరించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర అసెంబ్లీని సంప్రదించకుండా ఏకపక్షంగా, అప్రజాస్వామికంగా తీసుకున్న విభజన నిర్ణయాన్ని ప్రజలంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. రెండు నెలలుగా ప్రజలు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేస్తున్నా, వాటిని పట్టించుకోకుండా పదేపదే సీమాంధ్ర ప్రజల మనసులు గాయపడే రీతిలో పార్టీ నేతలు ప్రకటనలు చేస్తున్నారని తెలిపారు. ఇక హైదరాబాద్‌లోని సీమాంధ్రుల భద్రత విషయంలో తాము చేస్తున్న ప్రతిపాదనలను కేంద్రం పట్టించుకోవడం లేదనే అనుమానాన్ని వారు వ్యక్తం చేసినట్లు సమాచారం. దిగ్విజయ్ స్పం దిస్తూ ‘అన్ని పార్టీలు తన వైఖరిని తెలిపాకే కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. సీడబ్ల్యూసీ నిర్ణయంపై వెనక్కి వెళ్లే అవకాశం లేదు. అయితే ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకునేందుకు తీర్మానాన్ని అసెంబ్లీకి పంపేందుకు ప్రయత్నిస్తా. ఈ విషయమై కేంద్ర హోంమంత్రితో మాట్లాడుతా. స్పష్టత వచ్చాక మీకు తెలియజేస్తా’ అని ఆయన చెప్పినట్లు తెలిసింది. ఇక సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తామని ఆయన చెప్పినట్లు సమాచారం. దిగ్విజయ్ సింగ్‌తో భేటీకి సీమాంధ్ర ఎంపీలు మాత్రం హాజరు కాలేదు.
మంచి పరిష్కారాలు చూపుతాం: దిగ్విజయ్
ఈ భేటీ అనంతరం దిగ్విజయ్ మీడియాతో మాట్లాడారు. సీమాంధ్ర ప్రాంత నేతలు తనను కలవడం ఆనందంగా ఉందని, సీమాంధ్ర ప్రజల సమస్యలకు మంచి పరిష్కారాలు చూపుతామని చెప్పారు. ‘సీమాంధ్రులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తాం. హైదరాబాద్‌లోని సీమాంధ్రులకు, పౌరులకు రక్షణ కల్పిస్తాం. హైదరాబాద్‌లోని సీమాంధ్ర విద్యార్థుల, పారిశ్రామికవేత్తల ప్రయోజనాలను కాపాడుతాం. సీమాంధ్రలోని వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం. రెండు ప్రాంత ప్రజల మధ్య సత్సంబంధాలు నెలకొనాలనేది మా ఆకాంక్ష’ అన్నారు.
ఏకపక్షంగా ముందుకెళ్తే ప్రజాక్షేత్రంలో పరాజయమే
Published Fri, Oct 25 2013 2:36 AM | Last Updated on Tue, Aug 14 2018 3:55 PM
Advertisement