ముందుకు పడని అడుగు
Published Tue, Dec 10 2013 3:20 AM | Last Updated on Tue, Oct 2 2018 7:51 PM
చౌటుప్పల్, న్యూస్‌లైన్ :ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రానికి ముహూర్తం కుదరడం లేదు. ఈ నెల రెండో వారంలో పనులు ప్రారంభిస్తామని స్పీకర్ ప్రకటించినా ఆ దిశగా పనులేమీ జరగడం లేదు. అసలు పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. జిల్లాలో 8లక్షల మంది ఫ్లోరైడ్ బాధితులున్నారు. సమస్యను స్వయంగా తెలుసుకునేందుకు రాష్ట్ర శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌రావు 17మంది ఎమ్మెల్యేల బృం దంతో కలిసి గత ఏడాది జూలై 7, 8 తేదీల్లో మునుగోడు నియోజకవర్గంలో పర్యటిం చారు. ఫ్లోరోసిస్ బాధితుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, చలించిపోయారు. ఫ్లోరైడ్ శాశ్వత నివారణకు పాటుపడాలని తలంచారు. అందుకు ఫ్లోరైడ్‌పై మరిన్ని పరి శోధనలు అవసరమని భావించి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కృషి ఫలిం చింది. జాతీయ ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రం మంజూరైంది. దీనిని చౌటుప్పల్ మండలం మల్కాపురంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కేంద్రం నిర్మాణానికి రూ.100 కోట్లు మంజూరయ్యాయి. ఇందుకు అవసరమయ్యే 5 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించారు. ఇక్కడే ఫ్లోరోసిస్ బాధితుల కోసం 75పడకల ఆస్పత్రిని కూడా నిర్మించనున్నారు. రెండేళ్ల కాలంలో నిర్మాణాలన్నీ పూర్తయి సేవలు అందుబాటులోకి రావాలి.
స్థల వివాదం..
మల్కాపురం శివారులోని సర్వే నంబర్ 486లో 10ఎకరాల ప్రభుత్వ భూమిని వాహనాల సామర్థ్య కేంద్రానికి, దీని పక్కనే మరో 5ఎకరాల భూమిని జాతీయ ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రానికి కేటాయించారు. సర్వేనంబరు 486, 399లలో 8క్రషర్ మిల్లులకు 88ఎకరాల భూమిని మైనింగ్ కోసం ప్రభుత్వం లీజుకిచ్చింది. మైనింగ్ నిబంధన ప్రకారం.. మిల్లులకు లీజుకు ఇచ్చిన భూమికి 500మీటర్ల లోపు ఎటువంటి నిర్మాణాలకూ అనుమతించకూడదు. కాగా, ఓ క్రషర్ మిల్లుకు, వాహన సామర్థ్య కేంద్రానికి కేటాయించిన భూమి 500మీటర్ల లోపు ఉండడంతో ఆ క్రషర్ యజమాని రెండు నెలల క్రితం హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో కోర్టు వెహికిల్ ఫిట్‌నెస్ సెంటర్ పనులను నిలిపివేసింది. భూమి కేటాయింపుపై పునఃపరిశీలన చేస్తూ, నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. అయితే ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రానికి కేటాయించిన భూమి కూడా 500మీటర్ల లోపే ఉండడంతో పనులు ప్రారంభిస్తే క్రషర్ యజమానులు అభ్యంతరం చెప్పే అవకాశం ఉన్నందున అధికారులు ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. జిల్లా అధికారులు వేరే స్థలాన్ని కేటాయించాలని చూస్తున్నట్టు సమాచారం. రెండు నెలలవుతున్నా స్థల వివాదం పరిష్కారం కాకపోవడంతో ఈ నెల రెండో వారంలోనే ప్రారంభం కావాల్సి ఉన్న ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రం పనులు ప్రశ్నార్థకంగా మారాయి.
స్పీకరు గారూ.. మీరే పట్టించుకోవాలి
70 ఏళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న ఫ్లోరైడ్ సమస్యను అధిగమించేందుకు స్పీకర్ నాదెండ్ల మనోహర్‌రావు కృషితో జిల్లాలో జాతీయ ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రం ఏర్పాటవుతోంది. సమాజ ప్రయోజనాల దృష్ట్యా ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రం అత్యంత అవసరం. రెండు నెలలుగా స్థల వివాదం నెలకొన్నా, జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు గానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. పరిశోధన కేంద్రం ఏర్పాటుకు కృషి చేసిన స్పీకర్ ప్రత్యేక చొరవ తీసుకొని స్థల వివాదాన్ని పరిష్కరింపజేయాలని ప్రజలు కోరుతున్నారు..
Advertisement
Advertisement