
ఎన్టీఆర్ ఆశయాల సాధనకు పునరంకితం
మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు ఆశయాల సాధనకు పునరంకితమవుతామని టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు.
- ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు
- ఎన్టీఆర్ ఘాట్ వద్దనివాళులర్పించిన
- బాబు, కుటుంబసభ్యులు
సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు ఆశయాల సాధనకు పునరంకితమవుతామని టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు, కొడుకు లోకేశ్, కోడలు బ్రహ్మణి నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ పేదల కోసం ఎన్టీఆర్ చేసిన కృషి మరువలేనిదన్నారు.
తెలుగుజాతి ఉన్నంతవరకు ప్రజలు ఆయన్ని మరచిపోరని చెప్పారు. ఎన్టీఆర్ యుగపురుషుడని, ఆయనకు ఆయనే సాటి అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికి స్ఫూర్తిగా నిలిచాయని కొనియాడారు. దేశంలో కాంగ్రెస్ వ్యతిరేక శక్తులను ఏకం చేసిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందని చెప్పారు.
భావితరాలకు ఆయన ఆదర్శప్రాయం కావాలన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చంద్రబాబు కుటుంబసభ్యులతో పాటు ఎన్టీఆర్‌ఘాట్ వద్ద నివాళులర్పించినవారిలో ఉపముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి, ఆర్థికశాఖ మం త్రి యనమల రామకృష్ణుడు తదితరులున్నారు.