ఓటమి భయం.. మరో మాస్టర్‌ ప్లాన్‌! | Sakshi
Sakshi News home page

ఓటమి భయం.. చంద్రబాబు మరో మాస్టర్‌ ప్లాన్‌!

Published Thu, Feb 22 2024 11:28 AM

Kommineni Comments On Chandrababu's Big Master Plan - Sakshi

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు నిజంగానే రెస్ట్ అవ్వాలని ఆయన భార్య భువనేశ్వరి భావిస్తున్నారా? ఆయనది పెద్ద వయసు కనుక, ముప్పై ఐదేళ్ల పాటు కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నారు కనుక ఆమెకు ఆ ఆలోచన వచ్చింది. చంద్రబాబు ఆరోగ్య రీత్యానే ఆమె ఆ ప్రకటన చేసి ఉంటే అది అభినందించదగిందే. చంద్రబాబు కూడా నిజంగానే ఆమె కుప్పంలో పోటీచేయాలని అభిప్రాయపడుతుంటే కొంత అప్రతిష్ట వచ్చినా, కాస్త తెలివైన నిర్ణయమే అనిపించవచ్చు.

ఎందుకంటే తాను ఓడిపోతానేమో అన్న అనుమానం ఉన్నప్పుడు రిస్క్ తీసుకోకుండా ఈ ప్లాన్ అమలు చేయవచ్చు. అదే తరుణంలో భువనేశ్వరి కూడా తన మనసులో మాట బయటపెట్టారు. తాను కుప్పం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. ఆమె ఏదో సరదాగా చెప్పినట్లు కనిపించాలని అనుకున్నా, అసలు ఉద్దేశం బయటపెట్టినట్లయింది. కుప్పంలో చంద్రబాబు విజయావకాశాల మీద సందేహాలు రావడం వల్లే ఈ  ప్లాన్ వేసినట్లు  అనిపిస్తుంది. చంద్రబాబు ఈ సారి ఇక్కడ నుంచి పోటీచేయరు అని నేరుగా చెబితే దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది.

అందుకోసం టీడీపీకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్యాడర్‌ను మానసికంగా సిద్దం చేయడానికి ఆమెతో ఈ మాటలు చెప్పించి ఉండాలి. లేదా కుప్పం టీడీపీ క్యాడర్ పల్స్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అయినా అనుకోవచ్చు. లేదా ప్రత్యక్ష రాజకీయాలలోకి రావాలని భువనేశ్వరి ఆశిస్తుండవచ్చు! ఎందుకంటే ఆమె తండ్రి ఎన్.టీ రామారావు, ఇద్దరు సోదరులు హరికృష్ణ, బాలకృష్ణ, సోదరి పురందేశ్వరిలు రాజకీయాలలో చేరి ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారు. ఆ ప్రభావం కూడా పనిచేస్తుండవచ్చు. ఈ మధ్యకాలంలో భువనేశ్వరి కూడా న్యాయం గెలవాలి.. అంటూ ఒక కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. తన భర్త చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ కేసులో చిక్కి జైలుకు వెళ్లినప్పుడు భువనేశ్వరి ప్రజలలోకి వచ్చారు. దాంతో ఆమె  రాజకీయాల మజా రుచి చూసి ఉంటారు. ఇలా ఆమెకు ఈ కోరిక వచ్చి ఉండవచ్చు.

పైగా కుప్పం నియోజకవర్గంలో ఈ ఐదేళ్లలో జరిగిన అనేక పరిణామాలలో తెలుగుదేశం బాగా బలహీనపడింది. మున్సిపల్ ఎన్నికలలో ఎంత వ్యయం చేసినా, టీడీపీ గెలవలేకపోయింది. మండల, జడ్పీలలోను అదే పరిస్థితి. సర్పంచ్‌లు తొంభై శాతం మంది వైఎస్సార్‌సీపీవారే ఎన్నికయ్యారు. తత్ఫలితంగా టీడీపీ ఈసారి కుప్పంలో గెలుస్తుందా? లేదా? అనే చర్చ వచ్చింది. కుప్పం నియోజకవర్గంలో అనేక అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టడం, కుప్పంను మున్సిపాల్టీ చేయడం, ఆర్డిఓ కేంద్రంగా మార్చడం, కుప్పంకు కృష్ణా జలాలను తీసుకురావడం వంటివాటివల్ల వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రాఫ్ బాగా పెరిగింది. దాంతో చంద్రబాబు అక్కడ పోటీ చేయడానికి భయపడుతున్నారు. కాకపోతే ఆ విషయం చెప్పకుండా చంద్రబాబు దాటవేస్తున్నారు. ఎన్నికలు దగ్గరబడుతుండడంతో ఆయన తన భార్య ద్వారా ఈ విషయం చెప్పినట్లు అనుకోవాలి.

కానీ ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు గురించి ఆయన భార్య భువనేశ్వరి స్వయంగా విశ్రాంతి అవసరం అని చెప్పారంటే అందులో ఏదో మతలబు ఉండి తీరాలి. మరో రెండు ఎన్నికలు జరగనున్న తరుణం, ముఖ్యమంత్రి అభ్యర్ధి అని ఒకవైపు ప్రచారం చేస్తూ, మరో వైపు ఆయన భార్యే రెస్ట్ ఇవ్వాలని అనడం అంటే కచ్చితంగా డౌట్లు వస్తాయి. ఒకటి.. రాష్ట్రంలో, కుప్పంలో టీడీపీ గెలవలేదన్న భావన రావడం, రెండు.. కుప్పంలో చంద్రబాబును పోటీనుంచి తప్పించడం, మూడు.. ఆయనతో పోటీచేయించినా మరో సురక్షిత సీటునుంచి పోటీచేయించాలని అలోచించడం, నాలుగు.. నిజంగానే చంద్రబాబుకు రెస్టు ఇచ్చి, కుమారుడు లోకేష్‌ను ఫోకస్ చేయడం. వీటిలో ఏదైనా కావచ్చు.

గతంలో లోకేష్ ఎమ్మెల్యే కాకపోయినా, ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇప్పించడం, భువనేశ్వరి, బ్రాహ్మణిల ఒత్తిడి ఉందని అప్పట్లో టీడీపీ వర్గాలలో ప్రచారం జరిగింది. అలాగే ఇప్పుడు ఏమైనా చంద్రబాబు సీరియస్ పోటీలో ఉంటే, లోకేష్‌కు అవకాశాలు తగ్గుతున్నాయన్న భావన ఏమైనా ఉందేమో  తెలియదు. మరోవైపు చంద్రబాబు కుప్పం బదులు పెనమలూరు లేదా మరో సేఫ్ నియోజకవర్గం నుంచి పోటీచేయవచ్చన్న ప్రచారమూ ఉంది. ఇది కాకుండా బీజేపీ వారి పొత్తు కండిషన్‌లలో చంద్రబాబును ఏమైనా పార్లమెంటుకు పోటీచేయాలని కోరుతున్నారా? అనే ఊహాగానాలు ఉన్నాయి.

పెనమలూరులో చంద్రబాబు పోటీచేసే అవకాశం ఉందని ఐదారు నెలల క్రితం నుంచే టీడీపీ వర్గాలు అంతర్గంగా చెప్పుకుంటున్నాయి. కుప్పంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాగా ఫోకస్ పెట్టి అభివృద్ది పనులు చేయించడం, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గట్టిగా పనిచేసి చంద్రబాబును ఓడించాలని కంకణం కట్టుకున్న పరిస్థితిలో చంద్రబాబులో ఆందోళన ఉంటుంది. అంతేకాక ఆయన గతంలో ఎక్కువగా ఆధారపడ్డ దొంగ ఓట్లను చాలావరకు తొలగించారట. ఈ కారణాల రీత్యా  తాను పోటీచేయకపోయినా, తన భార్యను పోటీలో దించితే ఏమైనా సానుభూతి వస్తుందా? లేక ఓడిపోయినా అంత నష్టం ఉండదులే అనుకునైనా ఉండాలి. ఏది ఏమైనా భువనేశ్వరి ప్రకటన టీడీపీ క్యాడర్‌ను ఆలోచించుకునేలా చేస్తుంది. టీడీపీ గ్రాఫ్ పడిపోయిందనుకుంటున్న తరుణంలో ఈమె ప్రకటన  పెద్ద దెబ్బగా భావించాలి.

గతంలో కొందరు నేతలు తమ బదులు తమ భార్యలను పోటీలో ఉంచిన సందర్భాలు లేకపోలేదు. ఉదాహరణకు మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి తాను ఎంపీగా పోటీచేసి, వెంకటగిరి సీటును తన భార్య రాజ్యలక్ష్మికి ఇచ్చారు. ఆమె రెండుసార్లు గెలిచి, కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు. మరో మాజీ సీఎం దామోదరం సంజీవయ్య భార్య ఎమ్మల్యే కాలేదు కానీ, ఎమ్మెల్సీ అయి కొద్దికాలం మంత్రిగా కూడా ఉన్నారు. ఇలా ఇంకో మాజీ ముఖ్యమంత్రి ఎన్‌.టీ రామారావు రెండో భార్య లక్ష్మీపార్వతి ఆయనతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఒక దశలో ఆమెను ఉప ముఖ్యమంత్రిని చేయాలని ఎన్‌.టీ రామారావు అనుకున్నారని ప్రచారం జరిగింది. అతని మరణం తర్వాత ఆమె పాతపట్పం నుంచి పోటీచేసి ఉప ఎన్నికలో గెలిచారు. మరో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అనూహ్య మరణం తర్వాత  ఆయన  భార్య విజయమ్మ పులివెందుల నుంచి ఒకసారి ఏకగ్రీవంగాను, మరోసారి పోటీలోను నిలబడి గెలిచారు.

బీహారులో ముఖ్యమంత్రిగా పనిచేసిన లాలూ ప్రసాద్ యాదవ్ గడ్డి కుంభకోణంలో జైలుకు వెళ్లవలసి వచ్చినప్పుడు ఆయన తన పదవికి రాజీనామా చేసి బార్య రబ్రీదేవిని ముఖ్యమంత్రిని చేశారు. ఆ తర్వాత కాలంలో ఆమె ప్రతిపక్షనేతగా కూడా ఉన్నారు. ఇలా రకరకాల ఉదాహరణలు ఉన్నాయి. ఏది ఏమైనా భువనేశ్వరి ప్రకటన మొత్తం రాజకీయవర్గాలలో ఆశ్చర్యం కలిగిస్తే, తెలుగుదేశం వర్గాలలో తీవ్ర కలకలం రేపింది. అసలే పార్టీ గెలుస్తుందో, లేదో అని భయపడుతున్న తరుణంలో భువనేశ్వరి ఒక రకంగా రాజకీయ బాంబును పేల్చారని చెప్పవచ్చు.


– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Advertisement
 
Advertisement
 
Advertisement