- ‘సాక్షి’ కథనంతో స్పందించిన అధికారులు
- ముగ్గురు నిందితులతో పాటు కంప్యూటర్ల స్వాధీనం
పలమనేరు: లారీ యజమానులకు నకిలీ నేషనల్ పర్మిట్లను అంటగట్టి లక్షల్లో స్వాహా చేసిన ఓ ముఠాను పలమనేరు పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వీరు నకిలీ పర్మిట్ల తయారీలో ఉపయోగించే కంప్యూటర్లు, ప్రింట ర్లు, ఖాళీ పర్మిట్ కాగితాలు, నకిలీ సీళ్లు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు.
అర్బన్ సీఐ బాలయ్య కథనం మేరకు.. పలమనేరు చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన పలు లారీలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో నకిలీ పర్మిట్లు కలిగి ఉన్నందున అక్కడి ఆర్‌టీవో అధికారులకు పట్టుబడ్డాయి. సంబంధిత వాహనాల యజమానులు వాటిని పొందిన ఆర్‌టీవో ఏజెంట్లను నిలదీశారు. ఈ వ్యవహారంపై గత నెలలో ‘సాక్షి’ దినపత్రికలో వరుస కథనాలను ప్రచురించింది. దీనిపై అప్రమత్తమైన డీటీసీ బసిరెడ్డి పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. స్థానిక ఎంవీఐ మధుసూదన్ నకిలీ పర్మిట్ల వ్యవహారంపై పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అసలేం జరిగిందంటే..
పట్టణానికి చెందిన అహ్మద్‌బాషా ఆర్‌టీవో ఏజెంట్. ఇతని వద్ద సల్మాన్‌ఖాన్ పనిచేసేవాడు. కొన్నేళ్ల నుంచి అహ్మద్‌బాషా నకిలీ నేషనల్ పర్మిట్లను వాహన యజమానులకు తెలి విగా అంటగట్టేవాడు. దీన్ని గమనించిన అతని శిష్యుడు సల్మాన్‌ఖాన్ సైతం అదేబాట పట్టాడు. పట్టణంలోని ఎంవీఐ కార్యాల యంలో ఆ శాఖ లోగో కలిగి ఉన్న పలు ఖాళీ పర్మిట్ పేపర్లను చోరీ చేశారు. చిత్తూరు కార్యాలయంలోని సెక్రటరీ పేరుతో ఓ నకిలీ సీలును తయారుచేసి కంప్యూటర్ సాయంతో వీరే పర్మిట్లను అందజేశారు. ఇప్పటి వరకు 29 మందికి నకిలీ పర్మిట్లను అందజేసి రూ.5.65 లక్షలను పొందినట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఎలా పట్టుబడ్డారంటే..
పోలీసులు కొన్నాళ్లుగా పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు. సల్మాన్‌ఖాన్ అనే నిందితుడు బెంగళూరు నుంచి ఓ బస్సులో పట్టణంలోని రంగాపురం వద్ద దిగగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని ద్వారా గురువు అహ్మద్‌బాషాను పట్టుకున్నారు. వీరిని విచారించగా అసలు విషయం బయటపడింది. తమకు పట్టణానికే చెందిన శివప్రసాద్ అనే అతను నకిలీ సీల్‌ను తయారుచేసి ఇచ్చారని చెప్పారు. అతన్ని సైతం పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి కంప్యూటర్లు, ప్రింటర్లు, నకిలీ సీళ్లు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.