మూడేళ్ల క్రితం కన్నకూతురిని దారుణంగా హత్య చేసిన ఓ ఉన్మాది.. అందుకు సాక్షిగా నిలిచిన మరో మహిళను బలిగొన్నాడు.
మూడేళ్ల క్రితం కన్నకూతురిని చంపిన సైకో సదానందం
అప్పట్లో పోలీసులకు సాక్ష్యం చెప్పారని.. దారుణం
వెంకటాపురం, న్యూస్‌లైన్ : మూడేళ్ల క్రితం కన్నకూతురిని దారుణంగా హత్య చేసిన ఓ ఉన్మాది.. అందుకు సాక్షిగా నిలిచిన మరో మహిళను బలిగొన్నాడు. పోలీసులకు తన గురించి సమాచారం ఇచ్చారనే నెపంతో దారుణాని కి ఒడిగట్టాడు. ఈ ఘటన మండలంలోని బూర్గుపేటలో శనివారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జగ్గు సదానందం, అరుణ దంపతులకు మూడేళ్ల క్రితం కూతురు జన్మించింది.
ఆ పాప తనకు పుట్టలేదంటూ ఉన్మాదిగా ప్రవర్తించిన సదానందం అప్పట్లోనే ఆ పాపను గడ్డపారతో పొడిచి చంపేశాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ కేసులో అదే గ్రామానికి చెందిన శ్యామల జయపాల్‌రెడ్డి సాక్షిగా ఉన్నాడు. కాగా మూడేళ్లుగా సదానందం భార్య అరుణ నల్లబెల్లి మండలం రామతీర్థం గ్రామంలోని తన పుట్టింట్లో ఉంటోంది. ఇటీవల జైలు నుంచి విడుదలైన అతడు గ్రామంలో రెండు రోజులుగా కత్తి పట్టుకుని తిరుగుతూ తన భార్యను బూర్గుపేటకు తీసుకురావాలని అరుస్తూ హంగామా చేస్తున్నాడు.
ఈ క్రమంలోనే అతడు సైకోగా ప్రవర్తిస్తూ పాప హత్య కేసులో సాక్షిగా ఉన్న శ్యామల జయపాల్‌రెడ్డి ఇంటికి వెళ్లాడు. ఇంటి ఎదుట నిల్చు న్న జయపాల్‌రెడ్డి భార్య స్వరూప(32)ను కత్తితో కడుపులో రెండుసార్లు పొడిచాడు. ఆమె కేకలు వేయగానే పారిపోయాడు. గమనించిన స్థానికులు లక్ష్మిదేవిపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతిచెందింది. విషయం తెలుసుకున్న ఎస్సై యాసీన్ సంఘటన స్థలాన్ని సందర్శించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.