ఏడాదికి రెండుమూడుసార్లు ఓటరు జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు, చనిపోయినవారు, స్థానికంగా లేనివారి పేర్ల తొలగిం పు... ఇలా ఏటా చేస్తున్నా జాబితాలో పారదర్శకత కనిపించడం లేదు.
జగిత్యాల, న్యూస్‌లైన్ : ఏడాదికి రెండుమూడుసార్లు ఓటరు జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు, చనిపోయినవారు, స్థానికంగా లేనివారి పేర్ల తొలగిం పు... ఇలా ఏటా చేస్తున్నా జాబితాలో పారదర్శకత కనిపించడం లేదు. దీనిని అధిగమిం చేందుకు ఓటరు జాబితాను ఆధార్‌కార్డుతో అనుసంధానం చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనను ఇటీవల కరీంనగర్‌లో నిర్వహించిన ఓటరు అవగాహన సదస్సులో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ వ్యక్తం చేశారు.
మొదట పైలట్ ప్రాజెక్టుగా జగిత్యాల మండలంలోని రెండు గ్రామాలను ఎంపిక చేయాలని ఆదేశిం చారు. ఈ మేరకు జగిత్యాల సబ్‌కలెక్టర్ శ్రీకేశ్, తహశీల్దార్ శ్రీనివాసరావు కసరత్తు ప్రారంభించారు. చల్‌గల్‌తోపాటు మరో గ్రామంలోని రెండు పోలింగ్‌స్టేషన్ల పరిధిలోని ఓటర్లను ఆధార్‌కార్డుతో సంధానం చేసేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు సఫలమైతే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే అవకాశముండడంతో ఓటర్ల జాబితాలో తప్పులకు తెరపడనుంది. దీంతోపాటు గ్రామాల్లో లేకున్నా ఓటరుగా నమోదుకావడం, చనిపోయినవారి పేర్లూ జాబి తాలో ఉండడంతో ఓటింగ్ శాతం తగ్గుతోంది. ఆధార్‌కార్డుతో ఓటర్ ఐడీ కార్డును అనుసంధానం చేస్తే దొంగఓట్లను అరికట్టే అవకాశముంటుంది. ఒక్కరికే రెండుమూడు చోట్ల ఓట్లు ఉండే అవకాశముండదు. ఎవరైనా చనిపోతే ఆధార్‌కార్డుతోపాటు ఓటర్ ఐడీకార్డు రద్దవుతుంది. గ్రామంలో ఓటు ఉండి స్థానికంగా లేనివారి ఓట్లు తొలగించేందుకు వీలుకలుగుతుంది. జాబితాలో తప్పులకు ఆస్కారం తగ్గుతుంది. తద్వారా ఓటింగ్ శాతం పెరిగే అవకాశముంటుందనే ఆలోచనతో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్నట్లు కమిషనర్ భన్వర్‌లాల్ అభిప్రాయపడ్డారు.
పైలట్ ప్రాజెక్టుగా చల్‌గల్
ఓటరు జాబితాకు ఆధార్‌కార్డు అనుసంధానానికి పైలట్ ప్రాజెక్టుగా జగిత్యాల మండలం చల్‌గల్ గ్రామాన్ని ఎంపిక చేశారని సమాచారం. మొదట ఈ గ్రామంలోని రెండు ఎన్నికల బూత్‌లను ప్రామాణికంగా తీసుకుని, ఓటరు జాబితాలో ఉన్న పేర్లను ఒకసారి తనిఖీ చేస్తారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఓటర్ ఐడీకార్డు ఉందా? అనే విషయం పరిశీలిస్తారు.
ఓటు లేని వారికి కొత్తగా ఫారం-6తో కొత్తగా ఓటు హక్కు కల్పిస్తారు. ఐడీ కార్డులు కూడా ఇస్తారు. ఉదాహరణకు గూడ మల్లారెడ్డి పేరున ఓటర్ గుర్తింపుకార్డుపై ఉన్న ఏపీ372560027124 నంబర్‌ను ఆధార్‌కార్డు నంబర్‌తో సరిపోలుస్తారు. ప్రస్తుతం ఆధార్ కార్డుకు మిగతా శాఖలు అనుసంధానం చేస్తున్నట్లుగా ఓటర్ ఐడీ కార్డు నంబర్‌ను కూడా అనుసంధానం చేస్తారు. ఈ పద్ధతితో చల్‌గల్ గ్రామంలో రెండు బూత్‌ల ఓటర్లను అనుసంధానం చేసే ప్రక్రియ విజయవంతమైతే.. ఇదే పద్ధతిని రాష్ట్రమంతా అమలు చేస్తారు.