ఎన్నికల విధి నిర్వహణలో ఉన్న మునగపాక ఎస్‌ఐ రవికుమార్‌ను భయబ్రాంతులకు గురిచేసి బియ్యం ఆటోలను తరలించడంలో ప్రధానపాత్ర పోషించిన...
మునగపాక, న్యూస్‌లైన్ : ఎన్నికల విధి నిర్వహణలో ఉన్న మునగపాక ఎస్‌ఐ రవికుమార్‌ను భయబ్రాంతులకు గురిచేసి బియ్యం ఆటోలను తరలించడంలో ప్రధానపాత్ర పోషించిన మాజీ సర్పంచ్ పెంటకోట సత్యనారాయణ, దేశం నాయకుడు డొక్కా నాగభూషణంతోపాటు మరో 48మందిపై కేసు నమోదు చేసి ఆటోను అదుపులోకి తీసుకున్నామని అనకాపల్లి రూరల్ సీఐ ఎస్.భూషణ్‌నాయుడు బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
ఈ నెల 5న ఎన్నికల ప్రక్రియలో భాగంగా మునగపాక బీసీ కాలనీ గోడౌన్ వద్ద ఆటోలో అక్రమంగా బియ్యం బస్తాలను తరలిస్తున్నారని అందిన ఫిర్యాదు మేరకు మునగపాక ఎస్‌ఐ జి.రవికుమార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారన్నారు. ఆటోలో పదిబస్తాల బియ్యాన్ని గమనించారన్నారు. అయితే అప్పటికే అక్కడకు చేరుకున్న టీడీపీ నేతలు పెంటకోట సత్యనారాయణ, డొక్కా నాగభూషణంతోపాటు మరో 48మంది కార్యకర్తలు ఎస్‌ఐ రవికుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ భయబ్రాంతులకు గురి చేశారన్నారు.
పోలీసులను పక్కకు నెట్టి బియ్యంలోడుతో ఉన్న ఆటోను సంఘటనా స్థలం నుంచి తరలించుకుపోయారన్నారు. విచారణలో భాగంగా సంబంధిత ఆటోను అదుపులోకి తీసుకున్నామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని భూషణ్‌నాయుడు తెలిపారు.