సాక్షి, కడప: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జిల్లాలో సాగుతున్న సమైక్య ఉద్యమం నేటితో 50 రోజులకు చేరింది. కడపలో జిల్లా మేధావి సమాఖ్య ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సోనియా, కేసీఆర్, చిరంజీవి దిష్టిబొమ్మలను దహనం చేశారు. విభజన విషం కక్కే పాముకు నిప్పంటించారు. కలెక్టరేట్ వద్ద ఉన్న సమైక్య పరిరక్షణ వేదిక శిబిరంలో మంగళవారం ఉపాధ్యాయులు, నీటిపారుదలశాఖ, గృహ నిర్మాణశాఖ ఉద్యోగులు రిలేదీక్షల్లో కూర్చున్నారు. శిబిరంలో సమైక్యవాదులు పాటలు పాడి నిరసన తెలిపారు. జర్నలిస్టుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. వృత్తివిద్యా కళాశాల ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి.
శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీ ఆధ్వర్యంలో విద్యార్థులు రిలేదీక్షల్లో కూర్చున్నారు. వైద్య సిబ్బంది నిరసనలు సమైక్యవాదులను అలరించాయి. సోనియా, దిగ్విజయ్, కేసీఆర్ వేషధారులకు వైద్య పరీక్షలు నిర్వహించడం, వేర్పాటువాదికి పోస్టుమార్టం నిర్వహించడం తదితర నిరసన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కలెక్టరేట్ గేటు వద్ద తెలుగుతల్లి విగ్రహానికి జేఏసీ కన్వీనర్ సింగారెడ్డి శ్రీరామచంద్రారెడ్డి పాలాభిషేకం నిర్వహించారు. పుష్పగిరి విద్యాసంస్థల ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఏపీ సర్వేయర్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సర్వే గొలుసులతో ఉద్యోగులు నిరసన తెలిపారు. న్యాయవాదులు, పంచాయతీరాజ్, డీఆర్‌డీఏ, ఎస్సీ కార్పొరేషన్, పంచాయతీరాజ్, నీటిపారుదలతో పాటు పలుశాఖల్లో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి.
ప్రొద్దుటూరులో ప్రైవేటు వైద్యులు, ల్యాబ్, స్కానింగ్, మెడికల్ షాపు నిర్వాహకులు భారీ ర్యాలీ నిర్వహించారు. మంగళవారం అత్యవసరం మినహా తక్కిన వైద్య సేవలు బంద్ చేశారు. పుట్టపర్తి సర్కిల్‌లో మానవహారం నిర్వహించారు. జీవనజ్యోతి పబ్లిక్ స్కూలు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. మంగళవారం రాజుపాళెం మండలం వాసుదేవపురం సర్పంచ్ వెంకటలక్షుమ్మ ఆధ్వర్యంలో మహిళలు రిలేదీక్షలకు కూర్చున్నారు. ఏపీ ఎన్జీవో శిబిరంలో ఆర్టీసీ ఉద్యోగులు దీక్షకు కూర్చున్నారు. న్యాయవాదుల దీక్షలు కొనసాగుతున్నాయి.
జమ్మలమడుగులో డిగ్రీ కాలేజీ లెక్చరర్లు ర్యాలీ నిర్వహించి, రిలేదీక్షలకు కూర్చున్నారు. పిడతలతో ‘సమైక్యభజన’ నిర్వహించారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. పార్టీలు ప్రజల మనోభావాలకు అనువుగా నడుచుకోకపోతే భవిష్యత్తు ఉండదని ఇద్దరూ వ్యాఖ్యానించారు. మైలవరం మండలం దొమ్మర నంద్యాలలో గ్రామస్తులు భారీ ర్యాలీ చే పట్టారు. సమైక్యాంధ్ర రచ్చబండ నిర్వహించారు. ఆపై వంటావార్పు చేపట్టారు. మైదుకూరులో వైద్యులు, ఆర్‌ఎంపీ డాక్టర్లు, మెడికల్ ఉద్యోగులు ర్యాలీ, మానవహారం నిర్వహించారు. రిలేదీక్షలు చేపట్టారు. రాయచోటిలో జేఏసీ శిబిరంలో నాయీబ్రాహ్మణ ఉద్యోగులు, సంఘం నేతలు రిలేదీక్షలకు కూర్చున్నారు. ఆర్టీసీ కార్మికులు రోడ్డుపైనే స్నానాలు ఆచరించి నిరసన తెలిపారు. పట్టణంలో ప్రభుత్వశాఖల ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. బద్వేలులో జేఏసీ ఆధ్వర్యంలో బీసీ సంక్షేమం సంఘం నేతలు దీక్షలకు కూర్చున్నారు.
వీరికి సంఘీభావంగా వెయ్యిమంది విద్యార్థులు మానవహారం చేపట్టారు. 12, 13వ వార్డు యువకులు మోకాళ్లపై నడుస్తూ నిరసన తెలిపారు. ఉపాధ్యాయులు, ఆర్టీసీ, మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు రిలేదీక్షల్లో కూర్చున్నారు. పోరుమామిళ్లలో వైసీపీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి.
కలసపాడులో జేఏసీ ఆధ్వర్యంలో యాగం నిర్వహించారు.
పోరుమామిళ్లలో పశువైద్యాధికారులు ఎడ్లబండ్లతో ర్యాలీ, మానవహారం నిర్వహించారు. రాజంపేటలో ైవె సీపీ రిలేదీక్షల్లో మంగళవారం 78 మంది కూర్చున్నారు. ఉపాధ్యాయులు రోడ్డుపై పాఠాలు బోధించి నిరసన తెలిపారు. న్యాయవాదుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ప్రైవేటు విద్యాసంస్థలు మంగళవారం నుంచి మూత వేశారు. రైల్వేకోడూరులో సమైక్యవాదులు 50 మీటర్ల భారీ జాతీయ జెండాను ఎగురవేసి సమైక్యవాణి వినిపించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించి, ధర్నా చేపట్టారు.
ఉక్కు సంకల్పం
Published Wed, Sep 18 2013 3:45 AM | Last Updated on Fri, Sep 1 2017 10:48 PM
Advertisement
Advertisement