సాక్షి, కడప : జిల్లాలో పండుగలు, పర్వదినాల రోజు కూడా సమైక్య ఆందోళనల పర్వం జోరుగా సాగుతోంది. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేవరకు తమ పోరు ఆగదని అన్నివర్గాల ప్రజలు ముక్తకంఠంతో హెచ్చరిస్తున్నారు. ఉద్యోగులు ఆందోళనల్లో పాల్గొంటూనే ఉన్నారు.
జిల్లావ్యాప్తంగా అన్నదాతలు రైతు గర్జనల పేరుతో కదం తొక్కుతూనే ఉన్నారు. పోరుమామిళ్ళలో ముస్లింలు భారీ ర్యాలీని నిర్వహించారు. ఎన్‌జీఓలు రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు నుంచి తెలంగాణా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తానని, సమైక్య రాష్ట్ర పరిరక్షణకు కట్టుబడి ఉంటానని హామీపత్రాన్ని తీసుకున్నారు. జిల్లావ్యాప్తంగా రిలే దీక్షలు సాగుతూనే ఉన్నాయి.
కడపలో సమైక్య సాధనే లక్ష్యంగా రిలే దీక్షలు సాగుతూనే ఉన్నాయి. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో డ్వామా, గృహ నిర్మాణ సిబ్బంది, ఉపాధ్యాయులు దీక్షల్లో పాల్గొన్నారు. నగర పాలక సంస్థ, నీటిపారుదల శాఖ ఉద్యోగులు, వాణిజ్య పన్నుల శాఖ, పంచాయతీ రాజ్, న్యాయశాఖ ఉద్యోగులు, న్యాయవాదుల రిలే దీక్షలు సాగుతూనే ఉన్నాయి.
జమ్మలమడుగులో మైలవరం, పెద్దముడియం, జమ్మలమడుగు మండలాలకు చెందిన వేలాది మంది రైతులు పట్టణంలో ర్యాలీ చేపట్టి కదం తొక్కారు. రాష్ట్ర విభజన వల్ల జరిగే నష్టాలను వీరికి అధికారులు, రాజకీయ పార్టీ నేతలు విపులంగా వివరించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, ఆర్డీఓ రఘునాథరెడ్డి, చిన్నయ్య పాల్గొన్నారు.
ప్రొద్దుటూరులో రిలే దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. మున్సిపల్ ఉద్యోగులు, న్యాయవాదులు, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు.
రాయచోటిలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో ఎండ్లపల్లె గ్రామస్తులు, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సిబ్బంది, న్యాయవాదులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రసూల్ సంఘీభావం తెలిపారు.
బద్వేలులో ఉపాధిహామీ సిబ్బందితోపాటు ఆర్టీసీ జేఏసీ, ఎన్‌జీఓలు, మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఉపాధిహామీ సిబ్బంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. పోరుమామిళ్ళ పట్టణంలో ముస్లింలు భారీ ర్యాలీని నిర్వహించారు. జేఏసీ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు రిలే దీక్షల్లో పాల్గొన్నారు.
మైదుకూరులో జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు పట్టణంలో భారీ ర్యాలీని నిర్వహించారు. విద్యార్థులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు.
రాజంపేటలో ఉద్యోగ జేఏసీ, రెవె న్యూ, సర్వేయర్ల సంఘం ఆధ్వర్యంలో దీక్షలు సాగాయి.
రైల్వేకోడూరు పట్టణంలో జేఏసీ నేత ఓబులేసు ఆధ్వర్యంలో రోడ్డుపై నిలబడి ఉద్యోగులు నిరసనను తెలిపారు. ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు నుంచి తెలంగాణా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తామనే హామీ పత్రాన్ని తీసుకున్నారు.
జనోద్యమం
Published Thu, Oct 17 2013 2:03 AM | Last Updated on Fri, Sep 1 2017 11:41 PM
Advertisement
Advertisement