పింఛన్ల పంపిణీ మా వల్ల కాదు!
- తీవ్ర పని ఒత్తిడిలో పురపాలక శాఖ
- ముందే సిబ్బంది కొరత..ఉన్న వారితో ఇతరత్రా పనులు
సాక్షి, హైదరాబాద్: సామాజిక పింఛన్ల పంపిణీ..పురపాలక సంస్థలకు మోయలేని ‘పని భారం’గా మారింది. ఇకపై పింఛన్ల పంపిణీ తమ వల్ల కాదని పురపాలక శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఉన్న సిబ్బంది పింఛన్ల పంపిణీలో నిమగ్నమైపోవడంతో పుర‘పాలన’కు సంబంధించిన కార్యక్రమాలకు విఘాతం కలుగుతోంది.
స్థానిక ప్రజల సమస్యలపై దృష్టిసారించేందుకు సైతం పురపాలక శాఖ కమిషనర్లు, ఇతర సిబ్బందికి సమయం చిక్కడం లేదు. ఇప్పటికే పలు ప్రాంతాల మునిసిపల్ కమిషనర్లు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పురపాలక సంఘాల్లో ఆస్తి పన్నుల వసూళ్లు గతితప్పడానికి ఇవే కారణాలని పురపాలక శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.
2014-15 తొలి అర్ధవార్షికానికి సంబంధించిన పన్నుల వసూళ్లకు గడువు ముగిసి 9 నెలలు గడిచిపోయినా రాష్ట్రంలో 40 శాతానికి మించి పన్నులు వసూలు కాలేదు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వం చేపట్టిన ఆస్తి పన్నుల సవరణకు సైతం ఆటంకాలు ఎదురయ్యాయి. ఇప్పటికే అన్ని మునిసిపాలిటీల్లో సవరించిన ఆస్తి పన్నుల రేట్లను ప్రకటించాల్సి ఉండగా..ఈ నెల 19వ తేదీకి వాయిదా వేశారు. ఇక కొత్తగా ఏర్పడిన నగర పంచాయతీల పరిస్థితి దారుణంగా ఉంది.
వరుస అడ్డంకులే: గడిచిన ఏడాది కాలంలో వరుసగా పంచాయతీ ఎన్నికలు, మునిసిపల్ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. సర్వే దరఖాస్తుల కంప్యూటరీకరణ ముగిసే లోపే మళ్లీ ప్రభుత్వం ఆహార భద్రత కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఒకటి తర్వాత ఇంకొక్కటి..ఇలా వరుస కార్యక్రమాల కోసం మునిసిపల్ సిబ్బందిని వినియోగించుకోవడంతో రాష్ట్రంలో పురపాలనకు తీవ్ర విఘాతం కలిగింది.
ఇదే విషయాన్ని రాష్ట్ర పురపాలక శాఖ సంచాలకుడు డాక్టర్ బి.జనార్దన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఆహార భద్రత కార్యక్రమం బాధ్యతల నుంచి మునిసిపల్ సిబ్బందిని తప్పించాలని విజ్ఞప్తి చేస్తూ ఆయన కొన్ని రోజుల కింద రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌కే జోషీకి లేఖ సైతం రాశారు. ప్రభుత్వం ఈ అంశంపై ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు.