బీజేపీ సహకారంతోనే రాష్ట్ర విభజన | the division of the state with the help of bjp | Sakshi
Sakshi News home page

బీజేపీ సహకారంతోనే రాష్ట్ర విభజన

Published Tue, Apr 8 2014 2:09 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

బీజేపీ సహకారంతోనే రాష్ట్ర విభజన - Sakshi

బీజేపీ సహకారంతోనే రాష్ట్ర విభజన

పొన్నలూరు, న్యూస్‌లైన్: పార్లమెంటులో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ సహకారంతోనేరాష్ట్ర విభజన చేపట్టిందని వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ సమన్వయకర్త జూపూడి ప్రభాకరరావు అన్నారు.

రెండో విడత ఈనెల 11వ తేదీ జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మండలంలోని ముత్తరాసుపాలెం, ముప్పాళ్ల, వేంపాడు, ఉప్పలదిన్నె, రావులకొల్లు, పొన్నలూరు, వెంకుపాలెం, రాజోలుపాడు, అగ్రహారం, తిమ్మపాలెం, పెద వెంకన్నపాలెం వరకు బైక్‌ర్యాలీ నిర్వహించారు.

ర్యాలీలో జూపూడితో పాటు ఎమ్మెల్సీ పోతుల రామారావు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, పార్టీ నాయకుడు మద్దులూరి మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు. బైక్ ర్యాలీలో పలు చోట్ల జూపూడి మాట్లాడుతూ రాజకీయ ప్రయోజనాలను ఆశించే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు పూనుకుందన్నారు. ఇందులో టీడీపీ నాయకుడు చంద్రబాబు హస్తం కూడా ఉందని విమర్శించారు.
 
 తెలంగాణ ఇచ్చినందుకు సోనియానే కాదు..సహకరించినందుకు ఈ చిన్నమ్మను కూడా గుర్తుంచుకోండని పార్లమెంటులో బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్ వ్యాఖ్యానించారని, అలాంటి బీజేపీతో పొత్తుపెట్టుకోవడం టీడీపీకే చెల్లిందన్నారు.  వలస నాయకులతో కిటకిటలాడుతున్న టీడీపీ ఏ క్షణంలోనైనా మునిగిపోతుందన్నారు. రాష్ట్రంలో స్థిరమైన పాలన అందించగల సత్తా జగన్‌కే ఉందన్నారు. ఎమ్మెల్సీ పోతుల రామారావు మాట్లాడుతూ పొన్నలూరు జెడ్పీటీసీ అభ్యర్థి అనుమోలు సాంబశివరావు, ఎంపీపీ అభ్యర్థి పల్నాటి వెంకటేశ్వరరెడ్డిని గెలిపించాలని కోరారు.
 
కార్యక్రమానికి ముందుగా ముత్తరాసుపాలెంలోని ఆంజనేయస్వామి గుడిలో నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. కొత్తశింగరబొట్లపాలెం గ్రామ నాయకుడు వేణుగోపాలరెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో ఆయన్ను పరామర్శించారు. గ్రామానికి చెందిన ధనకోటిరెడ్డికి జూపూడి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అగ్రహారం సర్పంచ్ నాయబ్స్రూల్, రాజోలుపాడు డీలర్ రూబేను పార్టీలో చేరారు.
 
కొత్తపాలెం నాయకుడు మార్తాల వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో 30 కుటుంబాలవారు, కల్లూరివారిపాలెంకు చెందిన కల్లూరి వెంకటేశ్వరరెడ్డి, బసిరెడ్డి సుబ్బారెడ్డి కాంగ్రెస్ నుంచి  వైఎస్సార్ సీపీలో చేరారు. చెరువుకొమ్ముపాలేనికి చెందిన పిల్లి గంగిరెడ్డి, పిల్లి వెంకటేశ్వర్లు కుటుంబాలు టీడీపీ నుంచి జూపూడి సమక్షంలో పార్టీలో చేరాయి. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఈశ్వరరెడ్డి, మండల కన్వీనర్ బెజవాడ వెంకటేశ్వర్లు, స్టీరింగ్ కమిటీ సభ్యుడు రాఘవరెడ్డి,పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు పిల్లి లక్ష్మీనారాయణరెడ్డి, ఏఎమ్‌సీ వైస్ చైర్మన్ ఎస్‌ఏ లియాఖత్‌తో పాటు మండలంలోని అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement