నిర్లక్ష్యంతో వాహనం నడిపి ఓ బాలుడి ప్రాణాలను బలిగొన్నారు.. కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రాణాలకు వెల కట్టి సెటిల్‌మెంట్ చేసుకున్నారు.
అరకు ప్రమాద ఘటనలో పోలీసుల పన్నాగం
పోలీసు అధికారిని కాపాడేందుకు చిరుద్యోగిపైకి నేరం నెట్టివేత
బాలుడి దుర్మరణం కేసులో పోలీసు డ్రైవర్‌పై కేసు, అరెస్టు
రెండు రోజులుగా పత్తాలేని సదరు అధికారి ఘటనపై విచారణ చేస్తున్నామన్న జిల్లా ఎస్పీ
నిర్లక్ష్యంతో వాహనం నడిపి ఓ బాలుడి ప్రాణాలను బలిగొన్నారు.. కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రాణాలకు వెల కట్టి సెటిల్‌మెంట్ చేసుకున్నారు. ఈ వ్యవహారం కాస్త ‘సాక్షి’ ద్వారా బట్టబయలు కావడంతో మరొకరిని బలి చేసేందుకు కుట్ర పన్నారు. ప్రమాద సమయంలో వాహనం నడుపుతున్నాడంటూ తీరిగ్గా.. రెండు రోజుల తర్వాత అమాయక డ్రైవర్‌పై కేసు బనాయించి.. అరెస్టు చేశారు. ప్రమాద సమయంలో వాహనంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ లేరంటున్నారు. అలాంటప్పుడు కేసు దర్యాప్తును స్వయంగా పర్యవేక్షించాల్సిన సదరు అధికారి అప్పటినుంచి ఎందుకు పత్తాలేకుండా పోయారన్నదానికి సమాధానం లేదు. అదొక్కటే కాదు.. ఈ కేసులో సమాధానం దొరకని ఇలాంటి ప్రశ్నలెన్నో ఉత్పన్నమవుతున్నాయి.
విశాఖపట్నం: రోడ్డు ప్రమాదంలో ఏడేళ్ల బాలుడి నిండు ప్రాణాలు బలిగొన్నా.. కనీసం పట్టించుకోకుండా పోలీసు అధికారి నిర్లక్ష్యంగా వెళ్లిపోయిన దారుణ ఘటనను తారుమారు చేసే కుట్రకు పోలీసు ఉన్నతాధికారులు తెరలేపారు. అరకులోయ మండలం కొత్తభల్లుగుడ గ్రామంలో శనివారం ఉదయం పోలీసు వాహనం ఢీకొని గిరిజన బాలుడు వంతాల సూర్య(7) అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. వాహనం బాలుడిని ఢీకొట్టిన తర్వాతైనా.. వాహనం దిగి ఏమైందో చూద్దామన్న కనీస మానవత్వం లేకుండా వాహనం నడిపిన పోలీసు అధికారి నిర్లక్ష్యంగా ముందుకు వెళ్లిపోవడం.. ఆనక ఊరి పెద్దలకు తెలిసి పంచాయితీ పెడితే డబ్బులు పారేసి సెటిల్ చేసుకున్న వైనాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకువచ్చింది. ప్రమాద విషయం ఆరోజే పోలీసు ఉన్నతాధికారులకు తెలిసినా బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ వాస్తవాన్ని బట్టబయలు చేస్తూ ‘ఖాకీ బండి.. కేసు ఉండదండి’ శీర్షికన సోమవారం ‘సాక్షి’ ప్రచురించిన కలకలం రేపింది. దీంతో ఎట్టకేలకు స్పందించిన ఉన్నతాధికారులు ఘటనపై కేసు నమోదు చేశారు. కానీ వాస్తవ ఘటనను తారుమారు చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. పోలీసు వాహనం బొలేరోను నడిపి ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ఎం.హెచ్.ఎస్.ఎస్. రాఘవేంద్రరావుపై ఐపీసీ 304 సెక్షన్ కింద కేసు కట్టి అరెస్టు చేసినట్టు అరకులోయ ఎస్సై పి.సింహాచలం తెలిపారు. అయితే వాస్తవానికి ప్రమాద ఘటన స్థలంలో డ్రైవర్ రాఘవేంద్రరావు లేరని తెలుస్తోంది. ఆ వాహనం నడిపింది కూడా ఆయన కాదని.. ఓ పోలీసు అధికారే స్వయంగా దాన్ని నడిపినట్టు చెబుతున్నారు. ఇదే విషయాన్ని పోలీసులను సూటిగా అడిగితే ‘ఏమో.. మమ్మల్నేమీ అడగొద్దు’ అంటూ తప్పించుకుంటున్నారు.
ఆ అధికారి లేరట.. నన్నేమీ అడగొద్దు -ఎస్‌ఐ సింహాచలం
అరకు ప్రమాద ఘటనకు ఓ పోలీసు అధికారి బాధ్యుడని అందరూ అంటున్నారు.. కానీ డ్రైవర్‌పై కేసు నమోదు చేయడమేంటని ‘సాక్షి ప్రతినిధి’ ఎస్‌ఐ సింహాచలాన్ని సూటిగా ప్రశ్నించగా ఆయన బదులిస్తూ.. ‘ఏమోనండి.. ఆయన లేరంటున్నారు మరి’.. అని నసిగారు. మరి ఘటనలో లేనప్పుడు కేసు దర్యాప్తును స్వయంగా పర్యవేక్షించాల్సిన ఆ అధికారి గత రెండు రోజులుగా ఎందుకు పత్తా లేకుండా పోయారని ప్రశ్నిస్తే... ‘ఏమోనండీ.. ఈ విషయంలో నన్ను ఇంతకంటే ఏమీ అడగొద్దు.. నేనేమీ చెప్పలేను’ అని వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఘటన జరిగిన రోజు ప్రమాదానికి కారకుడైన పోలీసు అధికారి ఎస్‌ఐ సింహాచలమే అని భావించిన గిరిజన నేతలు ఆయనపై దాడి చేశారు. ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోని ఎస్‌ఐ ఆ కేసు గురించి ఎవరు ఏం మాట్లాడినా తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారని అంటున్నారు.
ఎస్‌హెచ్‌వో ఉన్నట్టు తేలితే చర్యలు:జిల్లా ఎస్పీ
అరకులో జరిగిన ప్రమాద ఘటనలో ప్రస్తుతానికి డ్రైవర్‌ను అరెస్టు చేశామని, పోలీసు అధికారి ఉన్నట్టు తేలితే కచ్చితంగా అతన్ని కూడా అరెస్టు చేస్తామని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ తెలిపారు. సోమవారం ఆయన ‘సాక్షి ప్రతినిధి’తో మాట్లాడారు. జరిగిన ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టామని, వాస్తవాలు తేలిన తర్వాత దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.