=తీరప్రాంతాల్లో రైతుల ఆవేదన
=నారుమడులకు నీరందక ఆందోళన
=కాలువల్లో పడిపోయిన నీటిమట్టం
రబీకి ఆలస్యంగా నీరివ్వడంతో హడావుడిగా సాగు యత్నాల్లో ఉన్న రైతులకు ఇప్పుడు నారుమళ్లకే నీరందని పరిస్థితి నెలకొంది. భవానీల దీక్షల విరమణ నేపథ్యంలో ఐదు రోజుల పాటు నీటివిడుదల నిలిపివేస్తామని ప్రకటించిన అధికారులు గడువు ముగిసినా నీరివ్వడం లేదు. దీంతో శివారు ప్రాంతాల రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : రబీలో సాగునీటి కష్టాలు అప్పుడే ప్రారంభమయ్యాయి. సక్రమంగా సాగునీరు సరఫరా చేస్తారో లేదో అన్న మీమాంసలోనే రబీ సాగుకు సిద్ధమవుతున్న రైతులు.. రెండు, మూడు రోజులుగా నారుమడులకు కూడా నీరందకపోవటంతో ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఏడాది రబీకి నీరిచ్చే విషయాన్ని ప్రకటించేందుకు రోజులతరబడి నాన్చిన ప్రభుత్వం.. ఆ తర్వాత 20 రోజులు ఆలస్యంగా సాగునీరు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రైతులు ఎన్నో ఆశలతో నారుమడులు పోసుకునే పనిలో ఉన్నారు. నారుమడులు సిద్ధం చేసుకుని విత్తనాలు నానబెట్టి మొలకట్టారు. ఈ తరుణంలో గత రెండు రోజులుగా కాలువల్లో నీటిమట్టం పడిపోవటంతో నారుమడుల్లోకి నీరు ఎక్కటం లేదు. ఓ వైపు విత్తనాలు మొలకెత్తి నారుమడుల్లో చల్లేందుకు సిద్ధంగా ఉన్నా నీరు లేకపోవటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.
రెండు రోజులుగా నీటి విడుదల నిలిపివేత...
గత రెండు రోజులుగా రామరాజుపాలెం, బందరు కాలువలకు నీటి విడుదల నిలిపివేశారు. ఆకుమర్రు లాకుల వద్ద 2.20 మీటర్ల నీటిమట్టం ఉండాల్సి ఉండగా ఆదివారం 1.43 మీటర్లు ఉంది. బంటుమిల్లి ప్రధాన చానల్ మల్లేశ్వరం వంతెన వద్ద నీటిమట్టం ఐదు మీటర్లు ఉండాల్సి ఉండగా 3.5 మీటర్లు ఉంది. దీంతో కాలువ పక్క పొలాలకు మాత్రమే నారుమడులకు నీరందుతోంది. బ్రాంచి కాలువలకు నీటిసరఫరా జరగకపోవటంతో నారుమడులు పోసుకోవటం ఆలస్యమవుతోందని రైతులు చెబుతున్నారు. మల్లేశ్వరం వంతెన వద్ద బంటుమిల్లి ప్రధాన చానల్‌లో నీటిమట్టం పడిపోవటంతో కృత్తివెన్ను మండలానికి నీటిసరఫరా గణనీయంగా పడిపోయింది. దీంతో మండల పరిధిలోని నీలిపూడి, కొమాళ్లపూడి, చందాల, లక్ష్మీపురం తదితర గ్రామాల్లో రైతులు విత్తనాలు నానబెట్టి ఉన్నా నారుమడులు పోసుకునేందుకు అవకాశం లేకుండాపోయింది.
30 వేల ఎకరాల్లో నారుమడులు ఆలస్యం...
రామరాజుపాలెం కాలువలో నీటిమట్టం తగ్గిపోవటంతో గూడూరు, పెడన, బందరు మండలాల్లోని దాదాపు 30 వేల ఎకరాల్లో నారుమడులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. రామరాజుపాలెం కాలువ వెంబడి కాలువ పక్కనే ఉన్న పొలాల్లోని నారుమడులకు సైతం నీరందని దుస్థితి నెలకొంది. కైకలూరు, కలిదిండి మండలాల్లోనూ కాలువల్లో నీటిమట్టం తగ్గిపోవటంతో రైతులు నారుమడులు పోసుకునేందుకు సంశయిస్తున్నారు.
2.80 లక్షల ఎకరాల్లో వరిసాగు...
ఈ ఏడాది రబీ సీజన్‌లో దాళ్వా పంటకు ఎట్టకేలకు సాగునీటిని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో సముద్రతీరంలోని నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ, బందరు, పెడన, గూడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను, కైకలూరు తదితర ప్రాంతాల్లో 2.80 లక్షల ఎకరాల్లో వరిసాగుకు రైతులు సన్నద్ధమయ్యారు. నారుమడులు పోసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నెల 23 నుంచి 27 వరకు ఐదు రోజుల పాటు భవానీ దీక్షల విరమణ కారణంగా కాలువలకు నీటి విడుదలను తగ్గించారు.
దీక్షల విరమణ పూర్తయి మూడు రోజులైనా కాలువలకు నీటిని విడుదల చేయకుండా జాప్యం చేశారు. దీంతో తీరంలోని మండలాల్లో నీటి కొరత ఏర్పడింది. రబీ సీజన్ ప్రారంభంలోనే సాగునీటి విడుదలపై అధికారులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుండటంతో రానున్న రోజుల్లో సాగునీటి కోసం ఇంకెన్ని కష్టాలు పడాల్సి వస్తుందోనని రైతులు ఆందోళనకు చెందుతున్నారు. కాలువలకు నీటిమట్టం తగ్గినమాట వాస్తవమేనని, మంగళవారం నాటికి పూర్తిస్థాయి నీటి మట్టానికి కాలువలు చేరుకుంటాయని నీటిపారుదల శాఖాధికారులు చెబుతున్నారు.
నారుకూ నీరివ్వరేం..
Published Mon, Dec 30 2013 1:07 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement