తాగునీటికే తొలి ప్రాధాన్యం
- పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీహెచ్.అయ్యన్నపాత్రుడు
తిప్పనగుంట (హనుమాన్‌జంక్షన్ రూరల్) : రక్షిత తాగునీటి సరఫరాకు ప్రభుత్వం తొలి ప్రాధాన్యమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఉపాధిహామీ శాఖల మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. బాపులపాడు మండలం తిప్పన గుంటలో ఆయన, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా, సాంఘిక సంక్షేమ మంత్రి రావెల కిషోర్‌బాబు రూ.3.50 కోట్ల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు.
అనంతరం తిప్పనగుంటలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 13వేల గ్రామ పంచాయతీలకు ఆర్‌వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తొలివిడతగా 5000 పంచాయతీల్లో అక్టోబర్ 2 నుంచి ఆర్‌వో ప్లాంట్లు ప్రారంభిస్తామన్నారు. పుట్టిన పెరిగిన గ్రామం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ చైర్మన్ మొవ్వా తిరుమల కృష్ణబాబు ఆదర్శనీయుడని కొనియాడారు.
సమావేశంలో మంత్రులు ఉమా, కామినేని శ్రీనివాస్, రావెల కిషోర్‌బాబు, లోక్‌సభ ప్యానల్ స్పీకర్ కొనకళ్ల నారాయణరావు, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ చైర్మన్ ఎం.టి.కృష్ణబాబు తదితరులు ప్రసంగించారు. కలెక్టర్ ఎం.రఘునందనరావు, జేసీ మురళి, తహశీల్దారు, ఎంపీడీవో, జెడ్పీటీసీ సభ్యురాలు పాల్గొన్నారు.
కైకలూరులో..
కైకలూరు : తాగునీటికి అధికారులు, మంత్రులు ప్రాధాన్యత కల్పించాలని పంచాయతీరాజ్ శాఖమంత్రి సీహెచ్. అయ్యన్నపాత్రుడు కోరారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఆరోగ్య శాఖమంత్రి కామినేని శ్రీనివాస్‌తో కలిసి కైకలూరులో వివిధ కార్యక్రమాల్లో ఆదివారం పాల్గొన్నారు. ముందుగా స్థానిక సంతమార్కెట్‌లో రూ. 7 లక్షల 50 వేలు మత్స్యశాఖ నిధులతో నిర్మించిన చేపల విక్రయ షెడ్డును ప్రారంభించారు. అనంతరం ఆయన శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులతో స్థానిక సీతారామఫంక్షన్ హాలులో సమీక్ష సమావేశం నిర్వహించారు.
కైకలూరులో అంతర్గత రోడ్ల ఏర్పాటుకు తక్షణం రూ. 2కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఉపాధి హామి పథకం నిధులతో గ్రామాల్లో రోడ్డు, పంచాయతీ, అంగన్‌వాడీ, పంచాయతీ భవనాలను ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. రెండు మండలాలకు కలిపి ఒక డంపింగ్‌యార్డును ఏర్పాటు చేసే యోచన ఉందన్నారు. అక్కడ చెత్తను వేయకపోతే సర్పంచ్ చెక్‌పవర్ రద్దు చేస్తామని హెచ్చరించారు.
పంచాయతీ సర్పంచ్‌లు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. మంత్రి కామినేని మాట్లాడుతూ జిల్లా శివారు ప్రాంతమైన ఈ నియోజకవర్గంలో తాగునీటి సమస్య వేధిస్తోందన్నారు. అందరూ సమన్వయంగా పనిచేసి అభివృద్ధి చేసుకోవాలని కోరారు. ఎంపీ మాగంటి బాబు మాట్లాడుతూ ప్రతి పనిని అధికారులు పారదర్శకంగా అవినీతి తావివ్వకుండా చేయాలని సూచించారు. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు అధ్యక్షత వహించారు. జెడ్పీచైర్‌పర్సన్ గద్దె అనురాధ, పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు, టీడీపీ నేతలు చలమలశెట్టి రామానుజయ్య తదితరులు పాల్గొన్నారు.
నిధులు దుర్వినియోగం చేయవద్దు
గ్రామీణ ప్రాంతాల్లో నీటి లభ్యత లేకపోయినా పలువురు అధికారుల ఆర్‌డబ్ల్యూఎస్ స్కీంలను నిర్మిస్తున్నారని మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. పనిచేయని అధికారులను పంపించేస్తామని, పనిచేసే అధికారులకు అండగా ఉంటామని చెప్పారు. కొల్లేరు పరిసర ప్రాంతాల చుట్టూ చేపల చెరువులు ఉండటం వల్ల రోడ్లు త్వరగా పాడవుతాయని అన్నారు. దీనిపైఅధ్యాయనం చేస్తామన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు రూ.10,500 ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.