ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూడికతీత పనుల పేరుతో చేపడుతున్న ఇసుక తవ్వకాల్లో నిబంధనలను పాటించడంలేదని జాతీయ హరిత ట్రిబ్యునల్‌కు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి
ఇసుక తవ్వకాలపై ఎన్జీటీకి నివేదించిన సీపీసీబీ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూడికతీత పనుల పేరుతో చేపడుతున్న ఇసుక తవ్వకాల్లో నిబంధనలను పాటించడంలేదని జాతీయ హరిత ట్రిబ్యునల్‌కు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నివేదిక సమర్పించింది. సీపీసీబీ గతంలో సమర్పించిన నివేదిక పూర్తిగా అసమగ్రంగా ఉండడంపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో అదనపు నివేదికను మంగళవారం సమర్పించిన సీపీసీబీ ప్రభుత్వ ఉల్లంఘనలను ట్రిబ్యునల్ దృష్టికి తీసుకొచ్చింది.
పూడికతీతకు వివిధ సంస్థలకు కేటాయించిన ఇసుక క్వారీల్లో.. ఏ ప్రాంతంలో పూడికతీయాలి, ఎంత పరిమాణంలో తీయాలి అన్న విషయంలో ప్రభుత్వం ఎక్కడా మార్గదర్శకాలు విడుదల చేయలేదని, దీంతో ఆయా సంస్థలకు క్వారీలో ఎక్కడైనా సరే ఎంతైనా తవ్వుకొనే స్వేచ్ఛ ఇచ్చారని ఆరోపించింది. అక్రమ ఇసుక తవ్వకాలపై రేలా అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ఈ కేసును మంగళవారం విచారించిన జస్టిస్ జావేద్ రహీం నేతృత్వంలోని ట్రిబ్యునల్ సీపీసీబీ నివేదికపై అభిప్రాయాలను తెలపాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది.