తనకొచ్చిన కష్టం ఇంకొకరికి రాకూడనుకున్నాడు. అలాంటి వారి కష్టాన్ని తీర్చుతున్నాడు. వారిలో ఆనందాన్ని చూసి తాను సంతృప్తి పడుతున్నాడు.
దివ్యాంగుల కోసం మరో దివ్యాంగుడి చేయూత
దక్షిణ ఆఫ్రికాలోని స్నేహితుని ద్వారా జైపూర్ కాళ్లు ఏర్పాటు
డర్బన్‌కు చెందిన కూబ్‌లాల్ పౌండేషన్ ద్వారా స్థానికంగా క్యాంపులు
అన్నీతానై సేవ చేస్తున్న యువకుడు
తనకొచ్చిన కష్టం ఇంకొకరికి రాకూడనుకున్నాడు. అలాంటి వారి కష్టాన్ని తీర్చుతున్నాడు. వారిలో ఆనందాన్ని చూసి తాను సంతృప్తి పడుతున్నాడు. రోడ్డు ప్రమాదాలు, అనారోగ్య సమస్యలతో కాళ్లు, చేతులు పోగొట్టుకున్న వారికి జైపూర్ కాళ్లు, చేతులను అమర్చే ఏర్పాట్లు చేసి మానవత్వాన్ని చాటుతున్నాడు ఓ దివ్యాంగుడు (వికలాంగుడు).
పలమనేరు: పలమనేరు నియోజకవర్గంలోని గంగవరం మండలం గండ్రాజుపల్లెకు చెందిన శంకర్‌కు పుట్టిన ఐదేళ్లకు పోలియో సోకింది. కడికాలు మోడిబారిపోయింది. దీంతో నడవలేకపోయాడు. అతని తండ్రి వెంకటేష్, అన్న కృష్ణప్ప కూలికి వెళ్లి కుటుంబాన్ని పోషించేవారు. పదో తరగతి దాకా పలమనేరులోని ఎస్సీ హాస్టలో చదువుకుని ఆపై ఇంటర్, డిగ్రీలను తిరుపతి ఎస్వీయూలో పూర్తిచేశాడు. అక్కడే ఉన్న బర్డ్స్ ఆస్పత్రిలో పోలియోకు మూడేళ్ల చికి త్స తీసుకున్నాడు. ఓ కర్ర సాయంతో నడవగలిగే స్థితికి చేరుకున్నాడు. వికలాంగ కోటాలో పలు ఉద్యోగాలకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఇంటికొచ్చి రెండు పాడి ఆవులను మేపుకుంటూ జీనవం సాగిస్తున్నాడు.
స్నేహితుడి సాయంతో..
గంగవరం మండలంలోని కీలపల్లెకు చెందిన సాగర్ అనే వ్యక్తి శంకర్‌కు స్నేహితుడు. సాగర్ దక్షిణ ఆఫ్రికాలోని డర్భన్‌లో పనిచేస్తున్నాడు. అతను పనిచేసే కంపెనీకి సమీపంలో కూబ్‌లాల్ పౌండేషన్ అనే సంస్థ నిర్వాహకులు దివ్యాంగులకు జైపూర్ కాళ్లను అమర్చుతారు. వారికి మనదేశంలోని జోధ్‌పూర్‌లో ఓ బ్రాంచి ఉంది. ఇదే సమయంలో శంకర్ వికలాంగుల సమస్యలను గురించి సాగర్‌తో వివరించాడు. దీంతోసాగర్ పక్కనే ఉన్న స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులతో మాట్లాడారు. భారత్‌లోని ఓ గ్రామంలో క్యాంపు పెట్టేందుకు ఒప్పించారు.
వికలాంగులకోసం సర్వే
తమ గ్రామంలో క్యాంపు నిర్వహించేందుకు కూబ్‌లాల్ ఫౌండేషన్ ఒప్పుకోవడంతో శంకర్ గంగవరం మండలమంతా తిరిగాడు. 660 మంది దివ్యాంగులను గుర్తించాడు. వీరిలో 35 మందికి జైపూర్ కాళ్లు అవసరమని తెలుసుకున్నాడు. ఆ స్వచ్ఛంద సంస్థకు ఓ నివేదిక పంపాడు. గత ఏడాది మేనెలలో విదేశీ సంస్థ పత్తికొండలోని పీహెచ్‌సీలో క్యాంపు నిర్వహించింది. 23 మందికి రూ.14 లక్షల విలువజేసే జైపూర్ కాళ్లను అమర్చిందింది. వారంతా ప్రస్తుతం నడవగలుగుతున్నారు. అనంతరం తాను గుర్తించిన 660 మందిలో వికలత్వ ధ్రువపత్రాలు కలిగిన వారిని 15 మంది సభ్యులతో శంకర్ సంఘాలు ఏర్పాటు చేయించాడు. వారికి ప్రభుత్వం నుంచి అందే సాయంతో పాటు మండల సమాఖ్య ద్వారా బ్యాంకు రుణాలను అందేలా చొరవచూపాడు.
ఇక నేనింతే అనుకున్నా
మడక దున్నుతూ ఉంటే కాలుకు కందిమోటు తగిలి పుండుగా మారింది. ఇన్‌ఫెక్షన్ సోకడంతో వైద్యులు కాలు తేసేశారు. జైపూర్ కాలు వేసుకోవాలంటే 70వేలు కావాలన్నారు. అంత డబ్బు లేదు. అలాంటి సమయంలో శంకర్ క్యాంపు పెట్టించాడు. నాకు కాలు అందేలా చేశాడు. నేనిప్పుడు నడవగలుగుతున్నా. ఆవును మేపుకుంటూ బతుకుతున్నా.
ఇక బడికెళ్లలేనేమో అని బాధపడ్డా
నాలుగేళ్ల క్రితం కరెంటుషాక్‌తో కాలు పోయింది. జైపూర్ కాలు అమర్చాలంటే లక్ష అవుతుందన్నారు. ఏం చేయాలో అర్థంగాక మా అమ్మనాన్న బాధపడ్డారు. అలాంటి సమయంలో పత్తికొండలో సౌత్‌ఆఫ్రికా వారు క్యాంపు పెట్టారని తెలిసింది. అక్కడికెళ్లి జైపూర్ కాలు పెట్టించుకున్నా. ఇప్పుడు నడవగలుగుతున్నా. ఇక్కడే ఏడో తరగతి చదువుతున్నా.
వారి కష్టాలు నాకు తెలుసు
నేనూ ఓ దివ్యాంగుడినే. కాళ్లు, చేతులు లేని వారు పడే బాధ చూసి వారికి కాళ్లు, చేతులు పెట్టించాలని అనుకున్నా. నా స్నేహితుడి సహకారం తీసుకున్నా. అవసరమైన వారికి జై పూర్ కాళ్లు పెట్టించా. కొత్తగా కాలు పెట్టించుకున్న వారు నడుస్తూవుంటే నాకు చాలా సంతృప్తిగా ఉంటుంది. మళ్లీ ఈసారి జూన్‌లో దక్షిణఆఫ్రికా సంస్థతో ఇక్కడ క్యాంపు పెట్టిస్తాం. - శంకర్