నిబంధనలకు నీళ్లు
అమలుకాని రూల్ ఆఫ్ రిజర్వేషన్
ఆటవిడుపుగా మారిన పార్ట్‌టైం పీహెచ్‌డీలు
{పైవేటు వర్సిటీని తలపించేలా అనంత జేఎన్‌టీయూ
యూనివర్సిటీ : విద్యాభ్యసం, పరిశోధనలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలన్న రాజ్యంగ నిబంధనలకు విరుద్ధంగా జేఎన్‌టీయూలో పీహెచ్‌డీ ప్రవేశాలు కల్పిస్తున్నా రు. దీంతో ప్రతిభావంతులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, స్పోర్ట్స్, ప్రత్యేక కేటగిరి విద్యార్థులకు అవకాశాలు దక్కడం లేదు. రాష్ట్రప్రభుత్వం ప్రైవేటు వర్సిటీలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవి ఏర్పాటు కాక ముందే ప్రైవేటు వర్సిటీ తరహాలో జేఎన్‌టీయూలో విధానాలు అమలు చేయడం గమనార్హం .
రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం..
జేఎన్‌టీయూలో ప్రతి ఏటా రీసెట్ నోటిఫికేషన్‌ను ఇస్తారు. ఇందులో దరఖాస్తు చేసుకొన్న వారికి ప్రాథమికంగా పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష అర్హత సాధించిన విద్యార్థులను ఇంటర్వ్యూల ద్వారా పీహెచ్‌డీ సీట్లను భర్తీ చేస్తారు. ఇందులో మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తించేలా ఆయా కేటగిరి విద్యార్థుల కోటా ప్రకారం భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇందుకు విరుద్ధంగా జేఎన్‌టీయూలో నిర్ణయాలు అమలు చేస్తుండం విమర్శలకు తా విస్తోంది. దీంతో బడుగు, బలహీన వర్గాలకు పరిశోధన లో అవకాశాలు దూరమవుతున్నాయి. మరోవైపు పీహెచ్‌డీ అడ్మిషన్ రాకపోవడంతో ఫెలోషిప్‌లు లభించడం లేదు.
ఆట విడుపులా..
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి ఫిస్ట్, శాప్ ప్రాజెక్ట్‌లు ఆయా విభాగాలకు పరిశోధన కొరకు వస్తాయి. వీటిలో జరిగే పరిశోధనల ద్వారా వర్సిటీకి న్యాక్(నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడియేషన్ కౌన్సిల్) గ్రేడింగ్ ఇస్తుంది. కానీ జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ యూనివర్సిటీ, అనంతపురంలో మాత్రం పార్ట్‌టైం పీహె చ్‌డీ ప్రవేశాలు కల్పిస్తున్నారు. బయట ప్రైవేటు కళాశాలల్లో అధ్యాపకులుగా పనిచేస్తున్నవారు ఆటవిడుపుగా ఈ విధానం ద్వారా పీహెచ్‌డీ చేస్తున్నారు. దీంతో పరిశోధన పడకేసింది. ఆవిష్కరణల ఊసే లేదు. చెప్పుకోదగ్గ పేటేంట్లు లేవు. పార్ట్‌టైం తరహా పీహెచ్‌డీలు రద్దు చేయాలని యూజీసీ గతంలోనే స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు జేఎన్‌టీయూలో అమలు కావడం లేదు.